జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి ఢిల్లీ మంత్రి జైన్

జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి ఢిల్లీ మంత్రి జైన్

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌జైన్‌కు వచ్చేనెల 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీకి ఇస్తూ  రౌన్‌ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆహారానికి సంబంధించి జైన్‌ విజ్ఞప్తిని కోర్ట్‌ అనుమతించింది. అయితే ప్రతి రోజూ జైన దేవాలయానికి వెళ్లేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్‌ జైన్‌ను ఇడి సోమవారం అరెస్ట్‌ చేసింది. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ముందు ప్రవేశపెడుతూ తమవద్ద గల ఆధారాలను నిర్ధారించుకోవడానికి, మనీ లాండరింగ్ ద్వారా ఎవ్వరు  ప్రయోజనం పొందారో తెలుసుకోవడానికి కస్టడీ అవసరమని తెలిపారు. 

ఈడీ తరపున హాజరైన సొలిసిట్ జనరల్ తుషార్ మెహతా 14 రోజుల కస్టడీ కోరారు. జైన్ ను ముందుగా అరెస్ట్ చేయకుండా ఈడీ ప్రశ్నించిందని, అయితే సమాధానాలు ఇవ్వకుండా దాటవేశాడని తెలిపారు. 

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హయాంలో మంత్రిగా ఉన్న జైన్‌ 2015-16 సంవత్సరంలో కోల్‌కతాకు చెందిన ఒక సంస్థతో అక్రమ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ  తెలిపింది. 2017లో అవినీతి నిరోధక చట్టం క్రింద సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది.