
సమాజాన్ని మార్చే ఆయుధం విద్యేనని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవాన్ని వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రారంభించి, మాట్లాడారు.
దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని చెబుతూ యాక్సెస్, ఈక్విటీ, నాణ్యత, స్థోమత, జవాబుదారీతనం అనే స్తంభాలపై నిర్మించిన జాతీయ విద్యా విధానం భారతదేశాన్ని శక్తివంతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ నూతన విద్యా విధానంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని గవర్నర్ తెలిపారు. ప్రధాని మోదీ.. మేక్ ఇన్ ఇండియా 2020లో భాగంగా కొత్త విద్యావిధానాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు.
చదువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఉపాధి అవకాశాలు అందుకునే విధంగా నూతన విద్యకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా యూనివర్సిటీల్లో పెను మార్పులు, చేర్పులు చేశారని ఆయన చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్టక్చర్ అభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన విద్యార్థులు, బంగారు పతకాలు, డాక్టరేట్ పొందిన రీసెర్చ్ స్కాలర్లను గవర్నర్ అభినందించారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జగదీశ్వర్రావు స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హజరై విద్యార్థులకు ఉత్తమ విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని సూచించారు. ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
కర్నూలు నుంచి హైదరాబాద్, బెంగళూరు పట్టణాలకు వెళ్లేందుకు అన్ని వసతులు ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేదని పేర్కొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎ.ఆనందరావు మాట్లాడుతూ..ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విశ్వవిద్యాలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అనంతరం నాటక, నవలా రచయిత, దర్శకుడు, నటుడు పాటిబండ్ల ఆనందరావు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డిలకు గౌరవ డాక్టరేట్, 66 మందికి బంగారు పతకాలు, 156 మందికి పోస్టు గ్రాడ్యుయేట్లను ప్రదానం చేశారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ