కలకలం సృష్టిస్తున్న వైసిపి ఎమ్యెల్సీ కారులో మృతదేహం!

అధికార పక్షానికి చెందిన కారులో అతని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి మృతదేహం ప్రత్యక్షం కావడం కాకినాడలో రాజకీయంగా దుమారం రేపుతున్నది.  ఇంటి నుండి బలవంతంగా తీసుకొచ్చి, రోడ్ ప్రమాదంలో చనిపోయాడని అంటూ కారులో మృతదేహాన్ని అతని ఇంటివద్ద వదిలివేయడం, పైగా డ్రైవర్ దళిత వర్గానికి చెందినవారు కావడంతో కలకలం రేపుతోంది
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ వద్ద కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం (23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు వారాల కిందట బైక్‌పై నుంచి పడిపోవడంతో ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
గురువారం  తన పుట్టినరోజు కావడంతో ఉదయ భాస్కర్‌ కాకినాడలోని స్నేహితులతో విందు చేసుకున్నారు. అదే సమయంలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి…. ‘‘సుబ్రహ్మణ్యం నాకు రూ.20 వేలు బాకీ ఉన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు. డబ్బులివ్వకుంటే ఊరుకోను’’ అని హెచ్చరించారు.
కాసేపటికి… మణికంఠ అనే తన స్నేహితుడిని సుబ్రహ్మణ్యం ఇంటికి పంపించి, అతడిని కాకినాడ కొండయ్యపాలెం వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యాన్ని మణికంఠ తీసుకెళ్లారు.  మూడు గంటలు గడిచాక… చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ ఫోన్‌ చేశారు. మీవాడికి యాక్సిడెంట్‌ అయ్యింది. స్పృహలో లేడు…” అని చెప్పారు.
ఆ తర్వాత అరగంటకు ఫోన్‌ చేసి… భానుగుడి జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్దకు రమ్మనడంతో అతని కుటుంభం సభ్యులు  అక్కడికి వెళ్లగా ఉదయభాస్కర్‌ కారు వెనుక సీటులో సుబ్రహ్మణ్యం చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆస్పత్రి వైద్యులు సుబ్రహ్మణ్యాన్ని పరీక్షించి, చనిపోయాడని చెప్పారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ డ్రైవర్‌ మృతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.  శనివారం కాకినాడలో పర్యటించే ఈ కమిటీలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, పార్టీ నేతలు ఎమ్మెస్‌ రాజు, పిల్లి మాణిక్యాలరావు సభ్యులుగా ఉన్నారు.
కాగా, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కి వ్యతిరేకంగా ఏజెన్సీ వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీడీపీ, బీజేపీ నాయకులు ఉదయభాస్కర్‌ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం, రాజవొమ్మంగి, మోతుగూడెంలో టీడీపీ నాయకులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు.