కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్‌ అరెస్ట్‌

కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్‌ అరెస్ట్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్‌ భాస్కర్‌ రామన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన చైనా సంస్థ ఆ దేశం నుంచి కార్మికులను తరలించేందుకు ఇబ్బంది పడింది. 
 
ఆ సమయంలో విద్యుత్‌ కేంద్రం పనుల కోసం చైనా నుంచి 250 మంది కార్మికులను పంజాబ్‌కు తరలించేందుకు కార్తీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న తన తండ్రి అధికారాన్ని ప్రయోగించి వారికి అక్రమంగా వీసాలు మంజూలు చేయించినట్లు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. 
 
ఈ వీసాల మంజూరుకు కార్తీ రూ.50లక్షలు ముడుపులుగా స్వీకరించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్‌ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి.
 
తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్‌ భాస్కర రామన్‌, తలవండీ, పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధి వికాస్‌ మఖరియా, ముంబైకు చెందిన బెల్‌టూల్స్‌ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్‌ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది.