దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు

ప్రయాణీకులను ఎడాపెడా దోచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కస‍్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సూచించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలైన ఓలా, ఉబెర్‌, జుగ్నూ, మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్‌ ప్రైసింగ్‌ అల్గారిథమ్‌, డ్రైవర్స్‌, పేమెంట్స్‌ స్ట్రెక్చర్స్‌ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించింది.

డిమాండ్‌ పేరుతో క్యాబ్‌ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్‌ చేస్తే చార్జీల మోత మోగిస్తున్నాయి. అడిగే అవకాశం లేక, నియంత్రించే మార్గం లేకపోవడంతో ఆయా సంస్థలు ప్రయాణికుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి.

పీక్ అవర్సే కాదుఎం సాధారణ సమయాల్లో సైతం అదనంగా  వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం తాజాగా క్యాబ్‌ సంస్థల ప్రతినిధులతో   సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేలా క్యాబ్ అగ్రిగేటర్‌లను హెచ్చరించాం. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.

గత నెలలో లోకల్‌ సర్కిల్‌ సంస్థ సర్వే నిర్వహించిన  సర్వేలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ఉన్నప్పటికీ డ్రైవర్‌లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నారని, అందుకు అదనంగా తమ వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు 71 శాతం మంది కస్టమర్‌లు ఫిర్యాదు చేశారు. 45 శాతం మంది యాప్ ఆధారిత టాక్సీ వినియోగదారులు తమకు సర్జ్ ప్రైసింగ్‌లో 1.5 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.