కరోనా మృతుల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య

కరోనా మృతుల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య
 
గత రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయిన పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) నిర్ణయించింది.  పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఇటువంటి పిల్లలకు దేశవ్యాప్తంగా ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ, భద్రత కల్పించి ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సుకు తోడ్పడటమే ఈ పథకం లక్ష్యం.  వీరికి 23 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఆర్థికంగా బాసటగా నిలిచి, స్వావలంబన వైపు వారిని నడిపిం చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
 
అయితే, వయసు ఆధారంగా పిల్లలను వివిధ తరగతుల్లో చేర్చుకుంటామని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారులు తెలిపారు.  1 నుంచి 12వ తరగతి వరకు వీరికి ఉచిత విద్య, ట్యూషన్ ఫీజ్ నుంచి, విద్యాలయ వికాస్ నిధి చార్జీల నుంచి కూడా  మినహాయింపు ఇస్తామని చెప్పారు. 
 
 ఒక్కో క్లాసులో ఇద్దరు పిల్లల చొప్పున ఒక్కో పాఠశాలలో గరిష్టంగా 10 మంది విద్యార్థులకు మేజిస్ట్రేట్ సిఫార్సు చేయవచ్చని కేవీఎస్ అధికారులు తెలిపారు. దేశంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రీజినల్ కార్యాలయాలన్నింటికీ పీఎమ్ కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గురించి తెలియ పరచినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.
 
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి పంపిన 4,058 మంది లబ్దిదారుల జాబితాను దేశంలో 1,240 కేవీఎస్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించామని ఆదేశిస్తూ ఆయా విద్యాలయాల ప్రిన్సిపల్స్ కు పంపినట్లు  కేవీఎస్ డిప్యూటీ కమిష నర్ తెలిపారు.
 
కేవీఎస్ లేదా కేంద్రీయ విద్యాలయాల నెట్వర్క్ కింద్ దేశంలో 1,240 పాఠశాలలు ఉన్నాయి. విదేశాల్లో ఖాట్మండు, టెహ్రాన్, మాస్కోలలో మరో మూడు పాఠశాలలు ఉన్నాయి. కేవీఎస్లలో మొత్తం 13 లక్షల మంది పిల్లలుండగా 48,314 మంది ఉద్యోగులు వీటిని నడుపుతున్నారు.  దేశవ్యాప్తంగా 25 రీజినల్ కార్యాలయాల పరిధిలో ఇవి పనిచేస్తున్నాయి.