
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఖలిస్తాన్ జెండాలు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, ప్రహరీపై ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అసెంబ్లీ కాంప్లెక్స్ గోడలపై ఖలిస్తాన్ నినాదాలు కనిపించాయి.
ఈ జెండాలను చూసిన సిబ్బంది కాంగ్రా పోలీసులకు సమాచారమిచ్చారు. కొందరు దుండగులు అసెంబ్లీ ఆవరణలో, గేటుపై ఐదు నుండి ఆరు ఖలిస్తాన్ జెండాలు ఉంచారని పోలీసులు తెలిపారు. గోడలపై నినాదాలు కూడా రాశారని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఈ జెండాలను పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది పిరికిపంద చర్య అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు. జెండా పాతిన వారికి ధైర్యం ఉంటే రాత్రి కాదు.. పగలు వచ్చి జెండా పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయని, దీంతో ఆ సమయంలోనే అక్కడ భద్రత ఉంటుందని ఆయన తెలిపారు.
దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది దుర్మార్గానికి పాల్పడ్డారని చెబుతూ ఈ వ్యవహారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని గత నెల 29న రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ నివేదికలు అందినట్లు సమాచారం.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భింద్రన్వాలే, ఖలిస్తాన్ జెండాలను కలిగి ఉన్న వాహనాలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో సిమ్లాలో భింద్రన్వాలే, ఖలిస్తాన్ జెండాలను ఎగురవేస్తామని సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించినట్లు సమాచారం.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్