తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం

తిరుమలలో అన్యమత ప్రచారంకు విశేషంగా అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలపై టిటిడి స్పందించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి, తిరుమ‌లకు తీసుకువెళ్ళ‌డాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించిందని గుర్తు చేసింది.
 
 టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రని టిటిడి స్పష్టం చేసింది. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌ అని పేర్కొన్నది. అయితే,  ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు `అవగాహనా రాహిత్యం’తో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోందని  అంగీకరించడం గమనార్హం. 
 
 వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతోందని హెచ్చరించింది.  కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. 
తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు
తిరుమల కొండపై తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అంజనాద్రి, హనుమంతుని జన్మస్థలం. తిరుమల అడవుల్లో ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం ఉన్న జాపాలి.. తిరుమల ఆలయం సమీపంలో నాద నీరాజనం, కొండలపై ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కూడా ఉత్సవాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.