చిదంబరం ఓ బ్రోకర్‌.. సొంత పార్టీ లాయర్ల ఆగ్రహం

చిదంబరం ఓ బ్రోకర్‌.. సొంత పార్టీ లాయర్ల ఆగ్రహం
కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కొల్‌కతాలో సొంతపార్టీకి చెందిన లాయర్లు చిదంబరంను అడ్డుకున్నారు.  మెట్రో డైరీ అవినీతి కేసు విచారణ కోసం కొల్‌కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరంపై కాంగ్రెస్‌ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్‌ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 అధికార టీఎంసీ పార్టీ తరఫున వాదించడానికి బుధవారం చిదంబరం కోల్కతా హైకోర్టుకు వచ్చారు. అయితే  ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సెల్ కు చెందిన కొంత మంది లాయర్లు హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. చిదంబరం రాగానే గో బ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడై ఉండి… పక్క పార్టీల కోసం ఎలా పని చేస్తారని వారంతా ఆయనను చుట్టుముట్టారు. చిదంబరం టీఎంసీ మద్ధతుదారుడని, ఆయన లాంటి వారి వల్లే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. 
 
కాగా, మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు.  ఈ నేపథ్యంలో సొంతపార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్‌ లాయర్లు మండిపడ్డారు.