
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ లో కాంగ్రెస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, సీనియర్ గిరిజన నాయకుడు అశ్విన్ కోత్వాల్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, వెంటనే బీజేపీలో చేరారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ నిమాబెన్ ఆచార్యకు అందజేశారు. ఉత్తర గుజరాత్‌లోని ఖేడ్‌బ్రహ్మ అసెంబ్లీ సీటు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను కాంగ్రెస్ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని అశ్వని కొత్వాల్ విమర్శించారు. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థానానికి పోటీపడుతున్న తనను కాదని మధ్య గుజరాత్‌కు చెందిన గిరిజన నేత సుఖ్రమ్ రథ్వాకి పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కొత్వాల్ రాకతో బీజేపీలో ఆదరణ కలిగిన గిరిజన నేతల లోటు పూడినట్టయింది. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో ఇంతకాలం బీజేపీకి ఆదరణ కలిగిన గిరిజన నేతలు ఎవరూ లేరు.
గత నెల రోజులుగా అశ్విన్ కొత్వాల్ బిజెపితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తున్నది. అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా సమర్పించగానే గాంధీనగర్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయం ‘కమ్లమ్’లో 2000 మంది మద్దతుదారులతో వెళ్లి బిజెపిలో చేరారు.
“నేను కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాను. గిరిజనుల పట్ల మొసలికన్నీరు కార్చడం తప్ప వారికోసం ఏమీ చేయడం లేదు” అని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ `అభివృద్ధి చేసే నాయకుడు’ అంటూ అటువంటి నాయకుడు దేశంలో లేరని, ఆయన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణించి, అన్ని చోట్ల అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
బిజేపికి సమాజం కోసం మంచి చేసే నాయకులు అవసరం అని, అటువంటి నాయకులనే ప్రోత్సహిస్తోందని చెబుతూ ప్రతి గిరిజన సోదరుడికి వారి ప్రాంతంలోనే సొంత ఇల్లు ఉండేటట్లు చేయాలని 2007లో తాను కలసినప్పుడు మోదీ చెప్పారని గుర్తు చేసుకున్నారు. గుజరాత్ లో బిజెపి పాలనలో విద్యా వ్యవస్థ విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణను ఆయన కొట్టిపారేశారు.
కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత ఝలక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాటిదార్ నాయకుడు, గుజరాత్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ తన ట్విటర్ బయో నుంచి కాంగ్రెస్ పేరును.. వాట్సాప్, టెలిగ్రామ్ బయో నుంచి కాంగ్రెస్ ప్రస్తావనలను తీసేశారు.
ఇప్పటి వరకు ట్విట్టర్ బయోగా ఉన్న ‘వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుజరాత్ కాంగ్రెస్’ను హార్ధిక్ తొలగించారు. ప్రస్తుతం ‘ప్రౌడ్ ఇండియన్ ప్యాట్రాయిట్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్’ అని తన బయోగా మార్చేశారు. ఈ మధ్యనే బీజేపీ నాయకత్వాన్ని ఓ ఇంటర్వ్యూలో పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటములు, పార్టీ నుంచి శాసన సభ్యులు తప్పుకోవడం వంటి కారణంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 77 సీట్ల నుంచి 65 సీట్లకు కుంచించుకుపోయింది. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకుంది. కాగా బిజెపి మాత్రం 99 సీట్ల నుంచి 112 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 182.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం