
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ జీవిత భీమా సంస్థల (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం చకచకా ఏర్పాటు జరుగుతున్నాయి. స్టేక్ డైల్యూషన్ విధానంలో 3.5 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా అమ్మడానికి ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్నట్టుగా మార్కెట్ పరిస్థితులను బట్టి దీనిని ఐదు శాతానికి పెంచేందుకు కూడా నిర్ణయించింది.
అయితే ఈ నిర్ణయానికి రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం ప్రభావం ఇంకా తగ్గనే లేదు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్ ఆసక్తిని బట్టి వాటా పెంపుపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
“ఐదు శాతం పరిమితి ఇప్పటికీ ప్రతిపాదనలో ఉంది. ప్రస్తుత డిమాండ్ ప్రకారం, మార్కెట్లు దాదాపు 3.5 శాతం వరకు సపోర్ట్ చేస్తాయి. పరిస్థితులను బట్టి ఇది ఐదు శాతం వరకు వెళ్తుంది” అని ఓ అధికారి చెప్పారు. రూ.ఆరు లక్షల కోట్ల విలువతో రూ. 21 వేల కోట్ల నుంచి- రూ. 30 వేల కోట్ల వరకు ఐపీఓ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
ఎల్ఐసీ వర్గాలు అందజేసిన సమాచారం ప్రకారం.. మే మొదటి వారంలో ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది. పాలసీహోల్డర్లకు రిజర్వేషన్లు, డిస్కౌంట్లు, ఇష్యూ ధర బుధవారం ఉదయం నాటికి ఖరారవుతాయి. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా నిలవనుంది.
తుది గడువు మే 12 కంటే ముందే ఆఫర్ మొదలవుతుందని, ఆ తర్వాత మార్చి క్వార్టర్ ఫలితాలతో డీఆర్‌హెచ్‌పీని రీఫైల్ చేస్తారని అంటున్నారు.
గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ, ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌పై పెట్టుబడిదారులకు చాలా ఆసక్తి ఉందని, అయితే ఐపీఓ లిస్టింగ్ విజయవంతం అవుతుందన్న నమ్మకం వచ్చినప్పుడే కేంద్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల అమ్మకాల ద్వారా వసూలు చేయాల్సిన మొత్తాన్ని రూ.65 వేల కోట్లకు తగ్గించారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో విధించిన టార్గెట్ రూ.78వేల కోట్ల కంటే ఇది తక్కువ. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా 2022 ప్రభుత్వం ఆర్ధిక సంవత్సరం లక్ష్యంలో 17 శాతం తక్కువ వసూలు చేయగలిగింది.
స్టాక్ మార్కెట్‌లలో హెచ్చుతగ్గులు పెరగడంతో ఎల్ఐసీ వాటా అమ్మకాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయవలసి వచ్చింది. మే 12 తరువాత కూడా ఐపీఓ మొదలుకాకుంటే, మరో రెండు నుండి మూడు నెలలు వరకు ఇష్యూ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు 7.9 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్ వాటా 63.25 శాతానికి చేరింది. పోయిన ఆర్ధిక సంవత్సరం కంటే ఇది తక్కువే! ఈ ఏడాది మార్చిలో కంపెనీ ప్రీమియం వసూళ్లు అంతకు ముందు సంవత్సరం మార్చి కంటే 51 శాతం పెరిగి రూ.42,319.22 కోట్లకు చేరాయి. 71 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
ఎల్ఐసీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో 2.17 కోట్ల బీమా పాలసీలను అమ్మింది. ఇది పోయిన ఆర్థిక సంవత్సరం కంటే 3.54 శాతం ఎక్కువ. అమ్మిన పాలసీల పరంగా దాని మార్కెట్ వాటాను 74.6 శాతానికి పెంచుకుంది. ఎల్ఐసీ మెగా ఐపీఓపై కనీసం 12 భారీ ఫారిన్, డొమెస్టిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
భారతదేశంలోని కనీసం ఐదు టాప్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కనీసం మూడు పెద్ద విదేశీ సావరిన్ ఫండ్‌లు, రెండు గ్లోబల్ పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, రెండు గ్లోబల్ హెడ్జ్ ఫండ్‌లు ఎల్‌ఐసి ఐపిఓను నిర్వహించే బ్యాంకర్లకు రూ.18 వేల కోట్లు పెట్టుబడిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ యాంకర్ ఇన్వెస్టర్లుగా రూ. 8 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!