నవనీత్ రాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్‌ఎల్‌ఎ రవి రాణా దంపతుల శనివారం పోలీసులు అరెస్టు చేయగా, ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ బాంద్రా లోని మెట్రోపాలిటన్ కోర్టు ఆదివారం ఆదేశించింది. అయితే, విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. దీంతో రెండు వారాల పాటు వారు జైలు జీవితం గడపనున్నారు.
 
మతకలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ నవనీత్ రాణా దంపతులను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153 ఎ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామని నవనీత్ రాణా దంపతులు సవాలు విసిరారు.
 
 దీంతో అధికార శివసేన పార్టీ నుంచి రాణా దంపతులకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. శివసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు.. నవనీత్, రవి రాణాపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. రాణా దంపతుల వ్యాఖ్యల వల్ల దేశంలో అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందంటూ శివసేన నేతలు ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవనీత్ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. రవి రానా మాట్లాడుతూ రేపు ముంబైకి ప్రధాని నరేంద్ర మోదీ రానుండటంతో తమ నిరసనలపై వెనక్కి తగ్గుతున్నామని వెల్లడించారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నవనీత్ దంపతులు విసిరిన సవాలు మత కలహాలకు దారి తీసేలా ఉందంటూ ముంబై పోలీసులు వారిని అరెస్టు చేశారు. శుక్రవారమే నోటీసులు కూడా జారీ చేశారు.మ‌రోవైపు ఏప్రిల్ 29 న వీరిద్ద‌రి బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. రాణా దంపతులపై దేశ ద్రోహం అభియోగం మోపడాన్ని ఆమె ఖండించారు.