ప్రధాని రాక ముందు లష్కరే తోయిబా అగ్ర కమాండర్ హతం

ప్రధాని రాక ముందు లష్కరే తోయిబా అగ్ర కమాండర్ హతం
మరో రెండు రోజులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పర్యటించనున్న సందర్భంగా  భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన  కాల్పులు జరుగుతున్నాయి. దానితో అధికారులు ప్రధాని పర్యటనకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. 
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మాల్వా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టాప్ కమాండర్‌తో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో టాప్ 10 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న లష్కరేటర్ కమాండర్ యూసుఫ్ కాంత్రూ మట్టుబెట్టారు.
 
కాగా, జలాలాబాద్‌ సుంజ్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక భద్రతా అధికారి ప్రాణాలు కోల్పోగా .. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా దళాలకు  సమాచారం అందిడంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి.
ఆర్మీతో పాటు బుద్గామ్ పోలీసుల ప్రత్యేక బృందం మాల్వా ప్రాంతంలో జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు.  దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు.
 
మరోవంక, భద్రతా బలగాలకు ఉగ్రమూకలకు మధ్య శుక్రవారం ఉదయం భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూ జిల్లాలోని జలాలాబాద్‌ సుంజ్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక భద్రతా అధికారి ప్రాణాలు కోల్పోగా .. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. 
 
మృతిచెందిన జవాన్‌ను సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) ఎస్పీ పటేల్‌గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీలు, ఇద్దరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు ఉన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.  
 
సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముందస్తు ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందిన తర్వాత తాము గురువారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని పేర్కొన్నారు. 
 
అయితే, ఉగ్రవాదులు 15 మంది సీఐఎస్‌ఎఫ్‌  సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని తెలిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లను ఉపయోగించి దాడులకు పాల్పడ్డారని, భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని కాల్పులను తిప్పికొట్టిందని తెలిపారు.
 
ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలి గ్రామంలో జరిగే భారీ సభలో ప్రసంగించనున్నారు. 019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.