`సుప్రీం’లో జగన్ కు ఎదురు దెబ్బ… ఎబివి సస్పెన్షన్ కొట్టివేత!

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా, కనీసం జీతం కూడా చెల్లించకుండా, `దేశద్రోహం’ చర్యలకు పాల్పడ్డారని అంటూ ఆరోపణలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావును తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు సుప్రీం కోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. సస్పెన్షన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, వెంటనే విధులల్లోకి తీసుకోవాలని శుక్రవారం ఆదేశించింది. 
 
ఏబీవీ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సుప్రీం సమర్థించింది. రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తి అయినందున ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేసింది. 
1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ  ఉన్నతన్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు.  
 
 జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఒకా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే విషప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
 
 ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు?.. ఇదంతా జరిగేందుకు కారకులెవరు? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా ? అని ఏబీవీ నిలదీశారు. ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. 
 
ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరునెలల కోసారి సస్పెన్షన్‌ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. 
 
తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారు? అంటూ  ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు సోమవారం  వరకు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరినప్పుడు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇంకెంత కాలం ఆయన్ను సస్పెన్షన్‌లో ఉంచుతారని నిలదీసింది. సుదీర్ఘకాలం సస్పెన్షన్‌లో ఉంచడం సరికాదని సూచించింది. 
 
అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధన 3(1సీ) ప్రకారం సస్పెన్షన్‌ రెండేళ్లకు మించరాదని, అంతకుమించి కొనసాగించాలనుకుంటే ఆలోపే కేంద్ర మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రెండేళ్ల కాలం ముగిసిన తర్వాత దానంతట అదే సస్పెన్షన్‌ ముగిసినట్లని తేల్చిచెప్పింది. సస్పెన్షన్‌ కాలం ముగిసిన తర్వాత… అంటే మార్చి 27న కేంద్రానికి కొనసాగింపు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని పేర్కొంది.
 
‘‘ప్రస్తుత స్థితిని ఉత్తర్వులు మార్చలేవు కదా? సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే మీరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు కదా..?’’ అని ప్రశ్నించింది. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌   ‘‘అవును… కాదు…’’ అని అనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఏ అంశంలో ప్రస్తుత స్థితి తెలుసుకుంటారని ప్రశ్నించింది. 
 
గరిష్ఠంగా ఎంత కాలం పాటు సస్పెన్షన్‌లో ఉంచాలో(ఔటర్‌ లిమిట్‌) నిబంధనల్లో ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ నిబంధన చెబితే దాని ప్రకారం నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ‘‘సస్పెన్షన్‌ ఇలా సుదీర్ఘకాలం పాటు కొనసాగరాదు. 2020 ఫిబ్రవరి 8న ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు 2022లో ఉన్నాం. హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించింది. 
 
మరికొంత సమయం ఇవ్వాలని న్యాయవాది కోరగా… ‘‘సమయం ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు మారవు కదా…? నిబంధన ఏం చెబుతుందో తెలిస్తే సస్పెన్షన్‌ను పొడిగించడానికి అవకాశం ఉందా అన్నది తెలుస్తుంది. నిరవధికంగా మీరు సస్పెన్షన్‌ను కొనసాగించలేరు’’ అని స్పష్టం చేసింది.