గవర్నర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

గవర్నర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను అవమానిస్తూ కొందరు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఉండడం కలకలం రేపుతున్నది. రాష్ట్రంలో ప్రధమ పౌరునికి ఇటువంటి అవమానం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రాజకీయ దురుద్దేశ్యాల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఆమెను అవమానపర్చేలా ట్రోల్స్‌ చేశారు. పొడవాటి ఎర్ర తిలకం దిద్ది ఉన్న గవర్నర్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తి.. ‘ మీ కోసమే ఈ ఫొటో. బయట తగిలియ్యండి. అంతా మంచిగుంటది’ అంటూ కామెంట్‌ పెట్టాడు. ‘మా ఉగాదిలో నీ గెలుకుడేందో?’ అంటూ నాలుక బయటపెట్టి లైట్‌ తీసుకుంటున్నట్లున్న ఎమ్మోజీని మరో వ్యక్తి పోస్ట్‌ చేశాడు. దీనికి ప్రతిగా పలువురు ట్విటర్‌ ద్వారా స్పందించారు.
 
 ఇదంతా టీఆర్‌ఎస్‌ అనుకూల వర్గాలే చేస్తున్నాయని, అందుకే పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణలు చెలరేగుతున్నాయి.  గౌరవనీయ పోస్టులో ఉన్న వ్యక్తిని అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్‌ బీసీ మహిళ అయినందునే ఇంత నిర్దాక్షిణ్యంగా ట్రోల్‌ చేస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు.  
 
రాజ్యాంగ ప్రతినిధి, రాష్ట్ర ప్రథమ పౌరురాలి పట్ల అవమానకర ట్రోలింగ్స్‌పై సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటారా లేదా? అంటూ నిలదీస్తున్నారు. గవర్నర్‌ను దుర్భాషలాడే సంస్కృతి తెలంగాణకు ఎప్పుడొచ్చిందని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మహిళా గవర్నర్‌ను అవమానపరుస్తూ వీరే.. మహిళా దినోత్సవాలు జరుపుతున్నారంటూ మరో నెటిజన్‌ ఆగ్రహించారు. ఎక్కువశాతం టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యర్థులను గౌరవించరని ఓ నెటిజన్‌ మండిపడ్డారు. ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయని, ఐటి మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 విభేదాలున్నా ఉన్నత పోస్టులోని వ్యక్తిపై అవమానకర పోస్టింగ్‌లు, ట్రోల్స్‌ పెడుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌పై అసభ్యకరంగా ట్రోల్స్‌ చేస్తే వెంటనే కేసులు పెట్టి నిందితులను అరెస్టు చేసే పోలీసులు.. రాష్ట్ర ప్రథమ పౌరురాలి విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
 
సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టుల పట్ల గవర్నర్ స్వయంగా రెండు రోజుల క్రితం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి సహితం మహిళా గవర్నర్ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర ప్రధమ పౌరురాలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను అవమానిస్తూ కొందరు సోషల్ మీడియాలో ఆమె పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,  మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె  బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
 
మహిళ అన్న గౌరవం కూడా లేకుండా ఉన్నత పదవిలో ఉన్న మహిళను అవమానిస్తూ పోస్టులుపెడుతుంటే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్దకమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
గవర్నర్   కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులెవరూ హాజరు కాకుండా అవమానిస్తుంటే, టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ట్విట్టర్ లో ఆమెను అవమానిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. షీ-టీమ్ లు పెట్టి మహిళలను వేధిస్తున్న వారిపై చర్యలుతీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ఆమె ఎద్దేవా చేశారు. అదే నిజమైతే,  గవర్నర్ ను అవమానిస్తున్న వారిపై షీ-టీమ్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.