భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం (డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం) ఏర్పాటు చేయడంతో సంప్రదాయ వైద్య చరిత్రలో కొత్త యుగం ఆరంభమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ జాంనగర్ లో జరిగిన ఈ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ పాల్గొన్నారు.
ఈ కేంద్ర ప్రారంభం సందర్భంగా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ప్రధానులు భారత్‌కు అభినందన సందేశాన్ని పంపారు. సంపూర్ణ ఆరోగ్యరక్షణకు ప్రజాదరణ పెరుగుతోందని, ప్రపంచంలోని ప్రతిఒక్కరికి రాబోయే 25 ఏళ్లలో ఈ కేంద్రం, సంప్రదాయ వైద్యం అత్యంత కీలకమవుతాయని మోదీ అంచనా వేశారు.
కరోనా సమయంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని, అందువల్ల ప్రపంచం ఇప్పుడు నూతన హెల్త్‌కేర్ అవకాశాలవైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. భారతీయ ఆయుర్వేదం కేవలం చికిత్స గురించి మాత్రమే చెప్పదని, సమగ్ర విషయాలను చర్చిస్తుందని తెలిపారు. ఆధునిక జీవనశైలి తెచ్చే అనారోగ్యాలను నయం చేయడంలో సంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
కాగా,భారత దేశంలో సంప్రదాయ వైద్యం ఉన్నట్లు తనకు తెలుసునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ చెప్పారు. జామ్ నగర్లో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు. ఈ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వం మార్చి 25న ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంగళవారం ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఘెబ్రెయెసుస్ మాట్లాడుతూ, భారత దేశంలోని సంప్రదాయ వైద్యం గురించి తాను తెలుసుకున్నానని తెలిపారు. తాను తన గురువులకు కృతజ్ఞుడినని చెప్పారు. తాను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు.
బాలీవుడ్ ఫ్యాన్స్‌కు స్విస్ అల్ప్స్ చాలా ఇష్టమైన ప్రదేశమని చెప్పారు. సాక్ష్యాధారాలుగల సంప్రదాయ వైద్యాన్ని బలోపేతం చేయడానికి సైన్స్ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తాత్కాలిక కార్యాలయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 250 మిలియన్ డాలర్లను సమకూర్చినందుకు, పదేళ్ళపాటు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, టెడ్రోస్ హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో మాట్లాడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఈ విధంగా మూడు భాషల్లో మాట్లాడటం తమ హృదయాలకు హత్తుకుందని చెప్పారు.
తృణధాన్యాల ప్రాముఖ్యత
తృణధాన్యాల ఆవశ్యకతను భారత్‌లో పెద్దలు పదేపదే చెప్పేవారని, కానీ కాలక్రమేణా వీటిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తాజాగా అందరూ వీటి ప్రాముఖ్యతను గుర్తించారని, తృణధాన్యాల వాడుకను ప్రోత్సహించాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస ఆమోదం తెలపడం సంతోషకరమని మోదీ చెప్పారు. 2023ను ఐరాస అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్య విధానాల ఆధారంగా రూపొందించిన ఫార్ములేషన్లకు బాగా గిరాకీ ఉందన్నారు. అనేక వ్యాధుల నియంత్రణలో యోగా కీలకమని చెప్పారు. కొత్త కేంద్రానికి ఆయన ఐదు లక్ష్యాలను నిర్ధేశించారు. అంతకుముందు టెడ్రోస్‌తో కేంద్ర ఆరోగ్యమంత్రి ఢిల్లీలో సమావేశమై ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడంపై చర్చలు జరిపారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను టెడ్రోస్ సందర్శించారు.
More Stories
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న కౌంటింగ్
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు