
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయాలన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు.
తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేస్తానని ఈశ్వరప్ప ప్రకటించారు. కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్యకు ముందు మంత్రి ఈశ్వరప్ప పేరు ప్రస్తావించినందున ఆయనపై కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరోవైపు ఉడుపి నగరంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తుండటం, ప్రభుత్వ పనులలో 40 శాతం `కమీషన్’గా అడుగుతున్నారని పేర్కొనడంతో ప్రభుత్వ ప్రతిష్ట కాపాడటం కోసం ముఖ్యమంత్రి ఈశ్వరప్ప రాజీనామా కోరినట్లు తెలుస్తున్నది.
“ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వంలో, నేను ఇప్పటివరకు గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాను. అయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు నిర్ణయించుకున్నాను. నేను 1 శాతం తప్పు చేసినా, నన్ను శిక్షించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఈ ఉందంతం నుండి విముక్తి పొందుతానని నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారణ జరగాలని ముఖ్యమంత్రిని కోరాను. అందుకు ఆయన అంగీకరించారు’ అని ఆయన మీడియాతో చెప్పారు.
ఇలా ఉండగా, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్వచ్ఛందంగా రాజీనామా చేయనున్నారని సీఎం బొమ్మై గత రాత్రి ప్రకటించారు. సంతోష్ ఆత్మహత్య ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మంత్రి ఈశ్వరప్ప తనకు వివరించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిర్దోషిగా తేలేంతవరకు మంత్రి బాధ్యతలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారని, ఇందుకు తాను కూడా అంగీకరించానని చెప్పారు.
బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, బీజేపీ సభ్యుడు సంతోష్ పాటిల్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్ క్లియర్ చేయడానికి.. 40 శాతం కమీషన్ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ ఆ కాంట్రాక్టర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది.
ఉడిపి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈశ్వరప్ప రాజీనామా చేయక తప్పలేదు. అంతకు ముందు, సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని, నిజం ఏమిటో బయటకు వస్తుందని ముఖ్యమంత్రి బొమ్మై చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగానే ఈశ్వరప్పపై చర్యలు తీసుకునే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
ఈ విషయంలో బిజెపి అధిష్టానవర్గం నుంచి ఎటువంటి జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. సమాచారం మాత్రమే వాళ్లు(బిజెపి అధిష్టానం) తీసుకున్నారని, దర్యాప్తు విషయంలో వారి పాత్ర ఏదీ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. బుధవారం రాత్రే సంతోష్ పాటిల్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యిందని, ఇక దర్యాప్తు మొదలు అవుతుందని ఆయన చెప్పారు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని బొమ్మై చెప్పారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి