నేడే బిడెన్ తో ప్రధాని మోదీ వర్చ్యువల్ భేటీ!

నేడే బిడెన్ తో ప్రధాని మోదీ వర్చ్యువల్ భేటీ!
రష్యాతో ఇంధన వాణిజ్య వ్యవహారాలు కొనసాగిస్తుండటంపై పశ్చిమ దేశాల నుంచి దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోమవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ  సోమవారం వర్చువల్‌గా చర్చలు జరపనున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలకు దూరంగా ఉండాలని మనదేశాన్ని అమెరికా పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ పరిస్థితి కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో పర్యటించిన బైడెన్‌ ప్రభుత్వంలోని కీలక నేత దలీప్‌ సింగ్‌ రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులపై తీవ్రంగా హెచ్చరించారు. దలీప్‌ సింగ్‌ వ్యాఖ్యలను హెచ్చరికలుగా చూడకూడదని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది
 
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, దక్షిణాసియా, ఇండో పసిఫిక్ రీజియన్ లోని ఇటీవలి పరిణామాలపై పరస్పర అభిప్రాయ మార్పిడి తదితర అంశాలపై చర్చిస్తారని  భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.  
 
భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక, సమగ్ర, భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని అభిప్రాయపడతున్నారు. ఈ చర్చల తరువాత, వాషింగ్టన్‌లో సోమవారం భారత్‌, అమెరికా మధ్య ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రుల మధ్య నాలుగో వార్షిక రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖల చర్చలు జరగనున్నాయి.
ఈ సమావేశం కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా చేరుకున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్‌, అమెరికా రక్షణ మంత్రి ల్లోయడ్‌ అయిస్టిన్‌తో వారు సమావేశమవుతున్నారు. బైడెన్‌ పరిపాలనలో ఇలాంటి చర్చలు ఇదే మొదటిసారి. సోమవారం సమావేశాల్లో రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాతావారణం, ప్రజారోగ్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.