ప్రధాని మోదీతో కీలక అంశాలను ప్రస్తావించిన జగన్ 

ప్రధాని మోదీతో కీలక అంశాలను ప్రస్తావించిన జగన్ 
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గంటకు పైగా సమావేశమై. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఓ  వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రికి సీఎం నివేదించారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరుతూ  2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిందని తెలిపారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతూ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్‌అథారిటీ తిరస్కరించిన్నట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం  లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్‌ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోందని చెప్పుకొచ్చారు.

ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్‌ ప్రజలకు మాత్రమే రేషన్‌ను ఇస్తున్నారని జగన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ గడువు ముగియడంతో  తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్‌ ఇప్పటికీ  తన నివేదికను ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.

అ గే ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. 16 చోట్ల బీచ్‌శాండ్‌ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరారు.  రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మిస్తున్న 11 బోధనాసుపత్రులకు తోడుగా మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని జగన్ కోరారు.

విభజన నాటికి పెండింగ్‌ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసిందని చెబుతూ,  ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన రూ.6,455.76 కోట్లను ఇప్పించాల్సిందిగా కోరారు.