కర్ణాటకలో సీనియర్ జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి బిజె పిలో చేరనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయనే పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
72 ఏళ్ల హొరట్టి, 1980 నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ వస్తున్నారు. జేడీఎస్ లో ప్రముఖ లింగాయత్ నేతగా పేరొందారు. ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలకు ముందే బీజేపీలో చేరుతానని హొరట్టి తెలిపారు. బీజేపీలో చేరే సమయం ఆసన్నమైందని చెబుతూ తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కూడా తన నిర్ణయంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు.
ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఎన్నికలు జరగగలవాని భావిస్తున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన జేడీఎస్ ప్రముఖ వ్యక్తులలో హొరట్టి కూడా ఒకరు. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తనను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పలతో ఈ విషయమై చర్చలు జరిపినట్లు హొరట్టి ధృవీకరించారు. హొరట్టి 1980లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక శాసనమండలిలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన జేడీఎస్ లో చేరారు. ఆయన ఎమ్మెల్సీగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

More Stories
భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు
వికసిత్ భారత్ కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తాం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం