ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ చీఫ్ జ‌స్టిస్ అహ్మద్

ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ చీఫ్ జ‌స్టిస్ అహ్మద్
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న  పాకిస్థాన్‌ మాజీ  ప్రధాన న్యాయమూర్తి  గుల్జార్‌ అహ్మద్‌ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ)పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి.. ఆ పార్టీ కోర్‌ కమిటీ ఆమోదముద్ర వేసిందని తాజా మాజీ మంత్రి ఫవాద్‌ చౌధరి సోమవారం తెలిపారు. 
 
అంతకుముందు పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ.. ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపట్టేవరకు ఇమ్రాన్‌ ఖానే ప్రధానిగా కొనసాగుతారని నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒకవేళ ఆపద్ధర్మ పీఎం నియామకాన్ని అంగీకరించకపోతే.. స్పీకర్‌ ఏర్పాటు చేయనున్న రెండు కమిటీలకు ఒక్కో దానికి ఇద్దరి పేర్లను సూచించాలని ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీ్‌ఫకు రాసిన లేఖలో అల్వీ  స్పష్టం చేశారు. 
 
మూడు రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియలో తాను పాల్గొనబోనని ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. అధ్యక్షుడు, ప్రధాని చట్టాలను ఉల్లంఘించారని.. ఇది అన్యాయమని విమర్శించారు. మరో 90 రోజుల్లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు గుల్జార్ అహ్మద్‌నే పాక్ ఆపధర్మ ప్రధనిగా కొనసాగించాలని పీటీఐ భావిస్తోంది.
1957లో జన్మించిన అహ్మద్‌ 2019 డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పాక్‌ ప్రధాన న్యాయమూర్తిగా  పనిచేశారు. పనామా పేపర్స్‌ కేసులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ పై అనర్హత వేటు వేసిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో అహ్మద్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు గట్టి తీర్పులు ఇవ్వడం ద్వారా పలుమార్లు పతాక శీర్షికలకు ఎక్కారు.
వాయవ్య పాకిస్థాన్‌లో అల్లరిమూకలు ఓ దేవాలయాన్ని ధ్వంసం చేయగా.. దాన్ని పునర్నించాలని జస్టిస్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. ఈ చర్యతో పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితులు కలిగినందున, కూల్చిన వారి నుంచే డబ్బు వసూలు చేసి ఆలయాన్ని పునర్నిర్మించాలని తీర్పు చెప్పారు. అంతేకాదు.. కొత్తగా నిర్మించిన గుడిలో ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకలకు కూడా హాజరయ్యారు.

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడాన్ని, అధ్యక్షుడు అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను పాక్‌ సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అధికార పక్షాన్ని వెనుక వేసుకు వచ్చారని, పౌరహక్కులు,  కేసుల సత్వర పరిష్కారం, ఖైదీల సత్వర విడుదల పట్ల ఆసక్తి చూపలేదని విమర్శలు చెలరేగాయి.  ఆయన హయాంలో, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో  చైర్మన్ అరెస్టు చేసే అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, పౌర హక్కులకు సంబంధించిన అంశాలపై పెద్దగా ఆయన దృష్టి పెట్టలేదు.
బెయిల్ మంజూరుపై కఠినమైన దృక్పథం ఉన్న న్యాయమూర్తులకు   ప్రతిపక్ష నేతలకు సంబంధించిన కేసులు వేసేవారు. ఆయనకున్న ముందు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన  ఆసిఫ్ సయీద్ ఖోసా నేర న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. సత్వర న్యాయం కోసం మోడల్ కోర్టులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ అంశాలపై జస్టిస్ అహ్మద్ దృష్టి సారింపలేదు.
ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో క్రిమినల్ కేసుల పెండింగ్‌లు పెరిగాయి.  రెండేళ్లుగా జైలులో ఉన్న ఖాదీల పిటిషన్లను పరిశీలనకు చేపట్టని సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతకు ముందు వలే అందుకోసం ఆయన ఎటువంటి ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగపరమైన, ప్రజా ప్రయోజన విషయాలను వినడానికి ఆయన చేసిన న్యాయమూర్తుల ఎంపికను విమర్శకులు ప్రశ్నిస్తుండేవారు.
జస్టిస్ గుల్జార్ కూడా తన హయాంలో పిటిఐ నేతృత్వంలోని ప్రభుత్వంపై చూసి, చూడన్నట్లు వ్యవహరించేవారు.  పాకిస్థాన్‌కు అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ ప్రభుత్వంకు, ఆయనకు మధ్య వారధిగా కీలక పాత్ర పోషించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఎపిఎస్) పెషావర్ దాడిలో చిన్నారుల అమరవీరులపై దాఖలైన కేసులో ఆయన నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం  ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సమన్లు ​​జారీ చేసింది.
అయితే, దుష్పరిపాలన, సమాఖ్య ప్రభుత్వ అధికారులపై కఠినమైన వ్యాఖ్యలు, పరిశీలనలు చేసినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి తన పదవీకాలంలో ఎటువంటి కఠినమైన ఉత్తర్వును జారీ చేయలేదు. గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో సాధారణ ఎన్నికలను నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయడం వంటి కొన్ని విషయాలలో సుప్రీంకోర్టు ఫెడరల్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించింది.
సింధ్ ప్రభుత్వం, అయితే, దుష్పరిపాలనకు సంబంధించిన సమస్యల కారణంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంది. అయితే, దానికి వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు ఉత్తర్వు కూడా జారీ కాలేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే,  వివిధ హై హైకోర్టుల న్యాయ, పరిపాలనా ఉత్తర్వులను గట్టిగా ప్రశ్నించేవారు. ఖైదీల విడుదలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పడవేసేవారు.