కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్రం పరిధిలో పనిచేస్తోన్న ఉద్యోగులకు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను మూడు శాతం పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అలవెన్సు పెంపు ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా వర్తించనుంది. పెంచిన అలవెన్సును జనవరి 1, 2022 నుంచి పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను గతంలో ఉన్న 31 శాతం నుంచి 34 శాతానికి అంటే 3 శాతం పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములా ప్రకారం డీఏ పెరుగుదల ఉంటుందని అధికారులు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డీఏ, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

డీఏ, డీఆర్ పెంపు కారణంగా ఖజానాపై సంవత్సరానికి రూ.9,544.50 కోట్ల భారం పడనుంది. అయితే మంత్రివర్గ నిర్ణయం వల్ల దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.