ఆర్‌సిఇపి చేరే ఉద్దేశ్యం భారత్ కు లేదు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి)లో చేరేందుకు భారత్‌ చర్చలు పున: ప్రారంభించిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తోసిపుచ్చారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా రెండేళ్ల క్రితం ఈ చర్చల నుండి దేశం వైదొలిగిందని ఆయన  గుర్తు చేశారు. 
 
ఆర్‌సిఇపి చర్చల సమయంలో .. వాణిజ్య చర్చల్లో కొన్ని దేశాలు అపారదర్శకంగా ఉంటూ, చట్ట నియమాలను పాటించడం లేదని పేరోన్నారు. ‘ఆర్‌సిఇపిలో భేటీలో భాగంగా అందులో పాల్గని, చర్చలు ప్రారంభించాలనే అనాలోచిత నిర్ణయం కారణంగా భారత్‌ విలువైన సమయాన్ని కోల్పోయింద’ని ఆయన తెలిపారు. 
 
ఈ చర్చల్లో భారత్‌ను భాగస్వామ్యం చేయాలని 10 ఏళ్ల క్రితం యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గోయల్ విమర్శించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం 15 ఇతర దేశాల సమూహాంతో కలిసేందుకు తమ వంతు కృషి చేశామని గోయల్‌ చెప్పారు. భారత్‌ 2012లో ఆర్‌సిఇపిలో చేరింది. 2019లో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి 15 దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. 
 
కానీ జాతి ప్రయోజనాలను సాకుగా చూపి ఆర్‌సిఇపి నుండి భారత్‌ తప్పుకుంది. 2019లో భారత్‌ ఇందులో చేరి ఉంటే.. పాడిపరిశ్రమ, వ్యవసాయం, చిన్న, సూక్ష్మ, మధ్య పారిశ్రామిక రంగాలు తీవ్ర ప్రభావమయ్యామని గోయల్‌ పేర్కొన్నారు. ఇందులో నుండి వైదొలగాలన్న మోదీ ప్రభుత్వం నిర్ణయం సరైనదేనంటూ.. దీని వల్ల భారత్‌ ఊపిరిపీల్చుకుంటోందని అంటూ తమ ప్రభుత్వ చర్యను ఆయన సమర్థించుకున్నారు.