కేంద్ర పోలీసుకు వంద రోజుల సెలవులు

కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు వంద రోజుల (సీఏపీఎఫ్) వార్షిక సెలవుల కోటాను వినియోగించుకునే సౌలభ్యం ఏర్పడుతోంది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఏడాదిలో కనీసం 100 రోజులు సెలవులిచ్చేందుకు అనుమతించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అత్యంత కీలకమైన ప్రతిపాదనను తీసుకువచ్చారు. 
 
విధి నిర్వహణల భారంతో ఉండే ఈ పోలీసు సిబ్బందికి తగు మానసిక శారీరక విశ్రాంతిని కల్పించాలని గుర్తించారు. వారు తమ కుటుంబాలతో కలిసి కనీసం వందరోజులు సంతోషంగా గడిపేందుకు ఈ ప్రత్యేక సెలవుల సదుపాయం అవసరమని భావిస్తున్నారు.  
 
ఈ నేపథ్యంలో ఈ వార్షిక సెలవుల ప్రణాళికకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమల్లోకి వస్తే సిఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, ఐటిబిపి, సిఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీతో పాటు అసోం రైఫిల్స్‌, ఎన్‌ఎస్‌జి, ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు పది లక్షల మంది జవాన్లు లబ్ది పొందే అవకాశాలున్నాయి. 
 
జవాన్లకు ప్రస్తుతం ఏడాదికి సుమారు 75 రోజులు సెలవు ఇస్తున్నారు. అయితే కేంద్ర బలగాలలో ఒత్తిడిని నివారించేందుకు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేసే సిబ్బందిలో సంతోషాన్ని నింపేందుకు, ఆత్మహత్యలు, తోటి సిబ్బందిపై కాల్పులను నివారించేందుకు వారి సెలవుల సంఖ్యను వంద రోజులకు పెంచాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనపై పలుసార్లు సమావేశం జరిపింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని, .దీనిని కార్యాచరణలోకి తీసుకువస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యంత కీలకమైన ఈ భద్రతా విభాగానికి సంబంధించి వంద రోజుల సెలవు దినాల మంజూరీ అంశంపై అన్నిస్థాయిలలో బేరీజు వేసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తారు.
 
 ఇప్పటికే ఈ దిశలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు దఫాల సమావేశాలు నిర్వహించింది. ఈ నెలలో జరిగిన సమావేశంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 
 
కరోనా నేపథ్యంలో చాలా కాలంగా పెండిగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను త్వరగా అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది. దీంతో కేంద్ర పోలీస్‌ బలగాల వార్షిక సెలవులు వంద రోజులకు పెంచడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకోనున్నదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.