ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిపాదించిన తీర్మానం భద్రతా మండలిలో ఓటమి పాలయింది. ఉక్రెయిన్‌లో మానవతా అవసరాలు పెరిగిపోయాయని పరోక్షంగా గుర్తించిన ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే 15 మంది సభ్యులున్న భద్రతా మండలిలో కనీసం తొమ్మిది ఓట్లు అనుకూలంగా రావాలి.
అంతేకాకుండా, మిగతా నాలుగు శాశ్వత సభ్య దేశాల్లో ఏది కూడా తీర్మానాన్ని వీటో చేయకూడదు. అయితే ఓటింగ్‌లో చైనా ఒక్కటే రష్యా తీర్మానానికి మద్దతు తెలపగా, మిగతా 13 సభ్య దేశాలు ఓటింగ్‌కు గైరుహాజరయ్యాయి. భారత్ సహితం ఈ తీర్మానంపై ఓటింగ్ లో పాల్గొనలేదు.
ఉక్రెయిన్‌లో మానవతా అవసరాలు పెరిగిపోవడానికి రష్యా దురాక్రమణే కారణమని స్పష్టంగా పేర్కొనే మరో తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చర్చించడం ప్రారంభించిన రోజునే భద్రతా మండలిలో రష్యా తీర్మానం ఓటమి పాలవడం గమనార్హం. ఉక్రెయిన్ , ప్రపంచం నలుమూలలకు చెందిన దాదాపు డజనుకు పైగా దేశాలు రూపొందించిన ఈ తీర్మానానికి దాదాపు వంద దేశాలు మద్దతు ఇస్తున్నాయి. రష్యా తన తీర్మానాన్ని ఈ నెల 15న ప్రవేశపెట్టింది.
అంతకు ఒక రోజు ముందు ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభానికి రష్యా దాడే ప్రధాన కారణమని ఆరోపించే ఒక తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఫ్రాన్స్, మెక్సికోలు నిర్ణయించాయి. భద్రతా మండలిలో ఈ దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. అయితే 193 సభ్య దేశాలున్న జనరల్ అసెంబ్లీలో వీటో ఉండదు.
రష్యాపై నాటో మరింత కఠిన వైఖరి
ఇలా ఉండగా, రష్యాపై మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నాటో దేశాలు నిర్ణయించాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇతర ఈయూ దేశాల అధినేతలు పాల్గొన్నారు. రష్యాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు చెందిన 400 మంది వ్యక్తులు, కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆధ్వర్యంలోని జీ7 దేశాలు, ఈయూ ప్రకటించాయి.
మరోవంక,ఎలాంటి ఆంక్షలు లేకుండా తమకు సైనిక సాయం చేయాలని నాటోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. ‘‘మా ప్రజలను, మా నగరాలను కాపాడుకునేందుకు.. మాకు మిలిటరీ సాయం కావాలి. అదీ ఎలాంటి ఆంక్షలు లేకుండా. ఇదే సమయంలో రష్యా ఆంక్షలను పట్టించుకోకుండా అన్ని ఆయుధాలను మా మీద ఉపయోగిస్తున్నది’’ అని చెప్పారు.
నాటో ప్రతినిధులతో గురువారం వీడియో లింక్ ద్వారా ఆయన మాట్లాడుతూ రక్షణ పరికరాలను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పిన జెలెన్‌స్కీ.. ఎదురు దాడులు చేసేందుకు ఆయుధాలు ఇవ్వాలని కోరారు.
‘‘మీ దగ్గర ఉన్న మొత్తం విమానాల్లో.. మీ దగ్గర ఉన్న మొత్తం ట్యాంకుల్లో ఒక్క శాతం మాకు ఇవ్వండి.. ఒకే ఒక్క శాతం” అని కోరారు. రష్యా తమపై పాస్పరస్ ఆయుధాలను ప్రయోగిస్తున్నదని చెప్పారు. ఈ ఉదయం కూడా తమపై ఆ బాంబులను వేసింద పేర్కొన్నారు.

More Stories
శ్రీ వైష్ణో దేవి మెడికల్ కాలేజీలో 90 శాతం ముస్లిం విద్యార్థులు!
ఉగ్రవాదులకంటే ప్రమాదకరం `మేధావులు’!
ముఖ్యమంత్రి మార్పుకై ఢిల్లీకి శివకుమార్ విధేయులు!