హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు

హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు

ఆసియా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా అవతరించింది. 

సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18 తేడాతో థాయిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే భారత అమ్మాయిలు దూకుడుగా ఆడారు. ప్రథమార్ధంలో భారత్ 20-9 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా అదే జోరును కొనసాగించింది. ఎటాకింగ్ గేమ్‌తో థాయిలాండ్‌కు కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. 

చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ భారత్ అలవోక విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. భావన శర్మ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచింది. ఇక చేతన శర్మ ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్ ప్రపంచ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.

భారత్ చారిత్రక విజయంపై హ్యాండ్‌బాల్ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ గెలుపు భారత హ్యాండ్‌బాల్‌లో నవ చరిత్రకు నాందిపలకడం ఖాయమని పేర్కొన్నారు. 

అమ్మాయిలు చారిత్రక ప్రదర్శనతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారని ఆయన అభినందించారు. భారత్ ప్రదర్శన తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని తెలిపారు. రానున్నరోజుల్లో హ్యాండ్‌బాల్ జనాదారణ క్రీడాగాపేరు తెచ్చుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.