
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో సోమవారం జరుగనున్న జనసేన ఆవిర్భావ సభలో ఎపి భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పార్టీ ఏర్పర్చి ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా జరపగా పోవడంతో, ఈ సారి భారీ ఎత్తున ప్రజలు పాల్గొనగలరని అంచనా వేస్తున్నారు.
భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని పేర్కొంటూ తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ ఇదని తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతామని ఆయన ప్రకటించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జన సైనికులతో పాటు రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఆయన తెలిపా రు. గ్రామాల నుంచి క్షేమంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో సభకు పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలుకుతూ రూపొందించిన వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ”ఈ సభను జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడటం లేదు. ఎపి భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతోంది. వైసిపి రెండున్నరేళ్ల పాలనలో ఏమేం జరిగాయి.. ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై సభలో మాట్లాడతాం” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
చాలా మందికి సందేహాలు ఉన్నాయి. చాలామంది విమర్శలు కూడా చేశారు. వీటన్నింటికీ ఆవిర్భావ సభలో సమాధానాలు చెప్పబోతున్నానని తెలిపారు. తెలుగు ప్రజల ఐక్యత, ఎపి అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని కోరుతూ, సభా ప్రాంగణానికి తనకెంతో ఇష్టమైన దామోదరం సంజీవయ్య పేరు పెట్టామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య శతజయంతి సంవత్సరం కావడం గమనార్హం.
సంజీవయ్య స్ఫూర్తితోనే తన ప్రసంగం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. హైవేకు దగ్గరగా ఉన్న సభా వేదిక వద్దకు అందరూ క్షేమంగా వచ్చి వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రండి. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ‘మన ఆవిర్భావ దినోత్సవం.. మన హక్కు ‘ అని చెప్పండి అని సూచించారు. పోలీసులు కూడా సభకు పూర్తిగా సహకరించాలని ఆ వీడియో సందేశంలో జనసేన అధినేత కోరారు.
More Stories
చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు