కరోనా కేర్‌ సెంటర్లలో ఆహారం సరఫరా బిల్లులపై ఆరా

రాష్ట్రవ్యాప్తంగా కరోనా  కేర్‌ సెంటర్లలో రోగులకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఎంత మొత్తం బిల్లులు చెల్లించాలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ సెంటర్ తోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం సరఫరా చేసిన వారికి బిల్లుల చెల్లింపు ఎందుకు ఆలస్యమవుతోందో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

బకాయిల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణాలడిగితే ప్రతి ఉన్నతాధికారీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినే బాధ్యుడిని చేస్తున్నారని పేర్కొంది. కరోనా వ్యాప్తి సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులు నుంచి భారీగా విరాళాలు అందాయని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్లకు వివిధ సంస్థలు, వ్యక్తులు రూ.కోట్లు విరాళాలుగా ఇచ్చారని, ఆ సమయంలో ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే ఎంత మొత్తం విరాళాలు వచ్చాయో తేలుతుందని తెలిపింది.

ఆ సొమ్ములో కొంతైనా బిల్లుల కోసం చెల్లించి ఉంటే.. అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చే పరిస్థితి ఏర్పడేది కాదని వ్యాఖ్యానించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. కొంత సమయమివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.

రోగుల ఆహారం కోసం ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ము (డైట్‌ చార్జీ) తక్కువగా ఉందని, ధరలను సమీక్షించి పెంచే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రులకు పేద ప్రజలే వస్తారని.. వారికి పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆదేశాలిచ్చారు.

కరోనా కేర్‌ సెంటర్లకు ఆహారం సరఫరా చేసినందుకు తమకు ప్రభుత్వం రూ.2.04 కోట్ల బకాయిలను చెల్లించలేదని పేర్కొంటూ శ్రీకాకుళానికి చెందిన మినర్వా హోటల్‌ యజమాని మెట్ట నాగరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు.  అలాగే బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు 2015 నుంచి ఆహారం సరఫరా చేసినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వి.గురునాథరావు, ఎం.సీతమ్మ పిటిషన్‌ వేశారు.

ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంపై వివరణ ఇవ్వాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు ఎస్‌ఎస్‌ రావత్‌, అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌లను ఆదేశించింది. సింఘాల్‌, భాస్కర్‌ హైకోర్టుకు హాజరయ్యారు. చెల్లింపుల్లో జాప్యం జరిగినందుకు ముఖ్య కార్యదర్శి క్షమాపణ చెప్పారు. పిటిషనర్లకు బిల్లులు చెల్లించామని తెలిపారు.