మాస్టర్‌కార్డ్‌, వీసా స్థానంలో చైనా యూనియన్‌ పే కార్డ్‌

చైనా యూనియన్‌ పే కార్డ్‌ ఆపరేటర్‌ సిస్టమ్‌ను వినియోగించి దేశ పౌరులకు కార్డులు జారీ చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పలు రష్యా బ్యాంకులు ప్రకటించాయి. రష్యాలో మాస్టర్‌కార్డ్‌, వీసా తమ సేవలు నిలిపివేస్తామని, దేశంలోని అన్ని బ్యాంకులను చెల్లింపు వ్యవస్థల నుండి డిస్‌కనెక్ట్‌ చేస్తామని ప్రకటించిన కొద్ది సేపటికే.. బ్యాంకులు ఈ చర్యకు ఉపక్రమించాయి. 
 
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల పాటు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆర్థిక సేవలందిస్తున్న వీసా, మాస్టర్‌ కార్డులు పేర్కొన్నాయి. ఈ చర్య వల్ల.. రష్యాలో జారీ చేసిన కార్డుల వినియోగం ఆగమ్యగోచరంగా మారనుంది. 
 
రష్యా వెలుపల జారీ చేసిన కార్డులు ఆ దేశంలో పనిచేయడం మానేస్తాయి. కాగా, ఇప్పటికే పే పాల్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఇంటెల్‌, ఇండిటెక్స్‌, ఎయ్‌ిబిఎన్‌బి, రోల్స్‌రాయిస్‌ వంటి కంపెనీలు తమ సేవలు నిలిపివేశాయి. 
 
కాగా, అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో.. మా సేవలు నిలిపి వేయాలని నిర్ణయించుకున్నాం’ అని అధికార ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రష్యాలో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 1 మిలియన్‌ (10 లక్షల మంది) సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 
 
మార్చి 7 నుండి కొత్త సబ్‌స్క్రిప్షన్లు నిలిచిపోగా, ప్రస్తుతమున్న సబ్‌స్క్రైబర్లు దాని సేవలు కొనసాగించలేరు. నాలుగు రష్యా షోలతో పాటు.. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించిన పలు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్లు గతవారం నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించగా.. తాజాగా ఈ చర్యలు చేపట్టింది. 20 రష్యన్‌ మీడియా చానెల్స్‌ను ప్రసారం చేసేందుకు నిరాకరిస్తున్నామని పేర్కొంది. ఈ చాన్నళ్ల సేవలను తాము వినియోగించుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది.