ఢిల్లీ పాఠశాలల్లో మతపర దుస్తులు నిషేధం!

హిజాబ్‌ వివాదం దేశమంతా నడుస్తున్న సమయాన.. దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డిఎంసి) ఓ నిర్ణయం తీసుకుంది. ఎస్‌డిఎంసి పరిధిలోని పాఠశాలల్లోకి ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించి రాకూడదని పేర్కొంది. ఈ మేరకు ఎస్‌డిఎంసి ఎడ్యుకేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌, ద్వారా బిజెపి కౌన్సిలర్‌ నిఖిత శర్మ.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

అదే విధంగా యూనిఫాంలో విద్యార్థులంతా అందంగా కనిపిస్తారని, దీని వల్ల ధనిక, పేద అనే ఆత్మనూన్యత భావం వారిలో ఉండదని ఆమె తెలిపారు. ముస్తాఫాబాద్‌లోని తిక్మిపూర్‌ పరిధిలోని ఓ పాఠశాల్లోకి హిజాబ్‌ తొలగించాకే అనుమతిస్తామని ఆరేళ్ల విద్యార్ధినిని చెప్పిన వార్త గురించి తెలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఖిత తెలిపారు. 

తనకు ఎదురైన అనుభవాన్ని బాలిక చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో, ఆమె తండ్రి పాఠశాల ప్రిన్సిపల్‌ను నేరుగా సంప్రదించడంతో వివాదం చెలరేగింది. తిరిగి ఇటువంటి ఘటన జరగకుండా తాను ఈ ఆదేశాలు జారీ చేసినట్లు నిఖిత తెలిపారు.

 ఢిల్లీలో కరోనా ఆంక్షలు సడలింపు 

ఇట్లా ఉండగా, కరోనా పాజిటివిటీ రేటు 1 శాతం, అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిడిఎంఏ) శుక్రవారం దేశ రాజధానిలో విధించిన  అన్ని కరోనా ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుండి పాఠశాలలను తెరిచేందుకు అనుమతించింది. ఫిబ్రవరి 28, సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మాస్క్‌లను ఉల్లంఘించడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి వాటిపై విధించే జరిమానాను రూ.2000 నుంచి రూ.500కి తగ్గించింది. డిడిఎంఏ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య, రెవెన్యూ శాఖల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో సడలింపులను ప్రకటించారు. నగరంలో కరోనా  కేసులు పెరిగితే మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.