తమిళనాడులో వెనుకబడ్డ అన్నాడిఎంకె… జోష్ లో బిజెపి

తమిళనాడులో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే బాగా వెనుకబడగా, అధికార డీఎంకే దూసుకు పోతుండగా, సొంతంగా పోటీచేసిన బిజెపి ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. 
 
గతంలో ఎన్నడూ లేనివిధంగా చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్‌ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకుంటుంది. 
మొత్తం సీట్లలో 43 శాతమే పోటీచేసిన బిజెపి మొత్తం ఓట్లలో 5. 33 శాతం ఓట్లు పొందింది. పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో పొందిన ఓట్లకంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. పోటీ చేసిన సీట్లలో 12.49 శాతం ఓట్లు పొందింది. 
 
మొదటిసారిగా ఆయకుడి మునిసిపాలిటీని, మందక్కడ్ నగర పంచాయతీని కూడా గెల్చుకోండి. చెన్నైలో డీఎంకేకు కంచుకోటగా భావించే తంబరం సీట్ ను బీజేపీకి గెల్చుకొంది.  తమిళనాడులో జరిగిన పట్టణ  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానాన్ని దక్కించుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే తరువాతి స్థానంలో కమలదళం ఉందని ఆయన చెన్నైలో చెప్పారు. 
 
కాంగ్రెస్, సీపీఎం, సీపీఐని వెనక్కు నెట్టి బీజేపీ ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ప్రకటించిన  ఫలితాల్లో 22 మున్సిపల్ కార్పోరేషన్, 58 మున్సిపల్ కౌన్సిల్ 233 పంచాయత్ సీట్లలో కాషాయ దళం ముందుంది.  ఎరనైల్ నగర పంచాయితీ ఎన్నికల్లో 15కు గానూ 12 స్థానాల్లో నెగ్గి బీజేపీ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఎన్నికల్లో డీఎంకే రికార్డ్ స్థాయిలో విజయాలు నమోదు చేసింది. రెండో స్థానంలో అన్నాడీఎంకే నిలిచింది.  2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్నిఅన్నామలై వర్ణించారు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. 
 
 తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్‌ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి.  కాగా, ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై.