ఇక ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తూ పోలీసుల కంట పడితే.. వాహనదారులకు చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంటు వేదికగా వెల్లడించారు.
అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని ఆయన తెలిపారు. మొబైల్‌ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్‌ ద్వారా ఫోన్‌ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని ఆయన అన్నారు.
‘ఇకపై కారు నడిపే డ్రైవర్‌ హ్యాండ్‌ ఫ్రీ aడివైజ్‌లను (బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌) ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే.. దాన్ని నేరంగా పరిగణించలేం. అయితే ఫోన్‌ కార్లో పెట్టకుండా.. జేబులో పెట్టుకోవాలి. ఇలా డ్రైవ్‌ చేస్తున్న వాహనదారులపై చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా విధిస్తే.. దాన్ని కోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది’ అని గడ్కరీ తెలిపారు.
అయితే మొబైల్‌ నేరుగా చేతిలో పట్టుకుని ఫోన్‌ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయొచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వాహనదారులకి ఊరటనిచ్చేదే అయినా.. ఫోన్‌ మాట్లాడుతున్నామని చెబుతూనే చెవిలో బ్లూటూత్‌ వంటివి పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా డైవింగ్‌ చేస్తే ప్రమాదం బారిన పడే అవకాశముందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.