నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. జనవరి 24 న పాజిటివిటీ రేటు రికార్డ్ స్థాయిలో 20.75 శాతానికి పెరిగితే.. ఇపుడు 4.44 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.  

జనవరి 21న మూడు లక్షలకు పైగా కరోనా కసులు నమోదైతే ఇపుడు రోజు వారీ కేసులు లక్ష లోపు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7.90 లక్షల ఆక్టివ్ కేసులున్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో మాత్రమే 50 వేలకు పైగా ఆక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు.కేరళలో అత్యధికంగా రోజువారీ పాజిటివిటీ రేటు 29.57 శాతంగా ఉందని తెలిపారు.

కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసినట్లు చండీగఢ్ ప్రభుత్వం ప్రకటించింది.  మార్కెట్లు, సినిమా హాళ్లు, మాల్స్, హోటళ్లు, బార్లు మరియు జిమ్‌లపై విధించిన అన్ని ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

పాఠశాలలు, విద్యా సంస్థలు ఫిబ్రవరి 14 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయని రాష్ట్ర ప్రభిఉత్వం  తెలిపింది. చండీగఢ్ బర్డ్ పార్క్, రాక్ గార్డెన్ శనివారం నుంచి తెరుస్తున్నట్లు తెలిపింది. 

ఇలా ఉండగా, గత మూడు నెలల్లో తమిళనాడు  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలున్న వారికి చేసిన పరీక్షల్లో 97 శాతం మందికి ఒమైక్రాన్‌ సోకినట్లు స్పష్టమైంది. మిగిలిన 3 శాతం డెల్టా వేరియంట్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఈ మేరకు దిగ్ర్భాంతి కరమైన విషయాలు వెల్లడయ్యాయి. 
 
ఆ సర్వే మేరకు.. 2020 నవంబరులో నిర్వహించిన సర్వేలో 32 శాతం మంది, 2021 ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో 29 శాతం, అదే ఏడాది అక్టోబరులో నిర్వహించిన సర్వేలో 70 శాతం మందికి వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని సర్వేలో తేలింది. 
 
నాలుగో విడత సర్వేలో 1,706 మంది సభ్యులతో కూడిన 30 బృందాలు 32,245 గ్రామాలు సహా పట్టణాల్లో ప్రజల రక్తనమూనాలు సేకరించి పరిశీలించి ఈ ఫలితాలను ఇటీవల వెల్లడించారు. ఆ ప్రకారం, పదేళ్ల పైబడిన వారిలో 87 శాతం వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని వైద్యులు తెలిపారు.