రామ్‌కుండ్‌లో లతా మంగేష్కర్ అస్థికల నిమజ్జనం

రామ్‌కుండ్‌లో లతా మంగేష్కర్ అస్థికల నిమజ్జనం
ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ అస్థికలను గురువారం మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉన్న పవిత్ర రామ్‌కుండ్‌లో ఆమె కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఆమె సోదరి ఉషా మంగేష్కర్, మేనల్లుడు అదినాథ్ మంగేష్కర్, ఇతర కుటుంబ సభ్యులు ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకుని శాస్త్రోక్తంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. 
అనేక మంది నాసిక్ వాసులు కూడా గోదా ఘాట్‌కు తరలివచ్చి గాన కోకిలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉషా మంగేష్కర్ విలేకరులతో మాట్లాడుతూ “ ఆమె నాకు సోదరి మాత్రమే కాదు, అమ్మ. శుభ ముహూరత్‌లో ఆమె నిమజ్జన కార్యక్రమాలన్నీ సజావుగా ముగించాము” అని పేర్కొన్నారు. 
 
లతా మంగేష్కర్ అస్థికల నిమజ్జనం కార్యక్రమాన్ని నాసిక్ పురోహితుల సంఘం అధ్యక్షుడు సతీశ్ శుక్లా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాసిక్ పురపాలక కమిషనర్ కైలాస్ జాదవ్, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
 ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) ఆదివారం ముంబయి ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ అస్థికలు ఉన్న మూడు కలశాలను అధినాథ్ మంగేష్కర్‌కు అందజేయడం జరిగింది. ఆయన లత సోదరుడు, స్వరకర్త హృదయనాథ్ మంగేష్కర్ కుమారుడు.