ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఫ్రాన్స్‌, జర్మనీ దౌత్యం

ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఫ్రాన్స్‌, జర్మనీ దౌత్యం

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఫ్రాన్స్‌, జర్మనీ దౌత్య యత్నాలు ప్రారంభించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ ఈ వారం రష్యా, ఉక్రెయిన్‌లలో పర్యటించారు. తర్వాత బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్‌ ఉల్ఫ్‌ షుల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం షుల్జ్‌, మాక్రాన్‌ ఇరువురూ కలసి పత్రికా గోష్టిలో మాట్లాడారు. 

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఏం చేయాలి అనేదానిపై తాము చర్చించామని తెలిపారు. అంతకుముందు అమెరికాలో పర్యటించిన షుల్జ్‌ రష్యా గనుక ఉక్రెయిన్‌పై దాడి చేస్తే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు దౌత్య మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

మరోవంక, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇటీవల భేటీ అయినప్పుడు నాటో విస్తరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌ను గనుక నాటోలో చేర్చుకుంటే రష్యా చూస్తూ ఊరుకోదని, అది ఫ్రాన్స్‌, రష్యా మధ్య యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పుతిన్‌ మాక్రాన్‌కు స్పష్టం చేశారు. 

ఎక్కడ, ఎప్పుడు తమ బలగాలను మోహరించాలో శాసించడానికి మీరెవరు అని పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ ఆందోళనలను అమెరికా, నాటో పట్టించుకోకుండా దూకుడుగు ముందుకొస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు.

కాగా, రష్యా ధోరణి పట్ల  అమెరికా, ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న  నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైనిక విన్యాసాలు చేపట్టింది. 1986లో అణు విస్పోటనం సంభవించిన చెర్నోబిల్‌ పట్టణంలో ఈ విన్యాసాలను అది బుధవారం నిర్వహించింది. అణు విద్యుత్‌ ప్లాంట్‌లో సంభవించిన పేలుడుతో ఆ ప్రాంతం ఎడారిగా మారింది. 

ప్రజలు వీడివెళ్లిన భవనాలు, నాటి సోవియట్‌ హోటళ్లపై సైనికులు కాల్పులు జరిపారు. ఆ భవనాలు కొన్నింటిపై ఇప్పటికీ సుత్తి కొడవలి గుర్తులు వున్నాయి. వాటిని ఉక్రెయిన్‌ సైన్యం ధ్వంసం చేసింది. ఒకప్పుడు ఈ పట్టణంలో చెర్నోబిల్‌ ప్లాంట్‌లో పనిచేసే 50వేలమంది కార్మికులు నివసించేవారు. అణు విస్ఫోటనం తర్వాత చాలామంది అన్నీ విడిచి, అక్కడ నుండి వేరే ప్రాంతాలకు తరలిపోయారు.