ఎన్నికల సభలకు నిబంధనల సడలింపు

ఎన్నికల సభలకు నిబంధనల సడలింపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వకేంద్రం ఎన్నికల వేళ కమీషన్ రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. బహిరంగ సమావేశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే.. రోడ్ ​షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇండోర్‌ లేక బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. 

అందుకు జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తీసుకోవాలని, కరోనా మార్గదర్శకాలు పాటించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండోర్‌ మైదానాల్లో 50 శాతం, బహిరంగ మైదానాల్లో 30 శాతం సీటింగ్‌ మేరకు ప్రజలకు అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. 

అటు.. ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శితోనూ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ శనివారం చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

కరోనా పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని, ఈ రోగులు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం కూడా తగ్గిందని ఈ అధికారులు చెప్పినట్లు తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక పరిశీలకుల్లో అత్యధికులు ఈ ఆంక్షలను సడలించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుతోందని, ఎన్నికలు లేని రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పినట్లు తెలిపింది.

కాగా, ఏడు దశల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల (ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌) ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న మొదలు కానున్నాయి. ఈ దశలో యూపీలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.