మరోసారి క్షీణించిన లతా మంగేష్కర్‌ ఆరోగ్యం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  బ్రీచ్ కాండీ హాస్పిటల్ ఐసియులో వెంటిలేటర్ పై వైద్యుల పరిశీలనలో ఉన్నారు. గతనెల  8 వ తేదీన ఆమె కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. 
 
అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మెరుగుపడుతోందని చెబుతూ వస్తున్నారు.

శనివారం ముంబయి బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యులు గాయని లతా మంగేష్కర్‌ హెల్త్‌ బులిటెన్ ను విడుదల చేశారు. “నిన్నటి నుండి గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమె ఐసియులో వైద్యుల పరిశీలనలో ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఆమె తర్వలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం” అంటూ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ లో పేర్కొన్నారు. 
 
ఆమె తొందర్లోనే కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని ఆశిస్తున్న తరుణంలో  బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు తాజాగా ప్రకటించిన హెల్త్‌ బులిటెన్‌ లతా మంగేష్కర్‌ అభిమానులు, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
కరోనా స్వల్ప లక్షణాలున్నప్పటికీ వయసురీత్యా ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. జనవరి నెలాఖారులో ఆమె కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె మరోసారి అనారోగ్యానికి గురికావడం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది.