
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈనెల 5న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 5న మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు. ఇక్రిశాట్ 50 స్వర్ణోత్సవాల కార్యక్రమంలో లోగోను ప్రారంభించిన అనంతరం పిఎం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
అక్కడ రామానుజచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, సిఎస్ సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రధాని ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్పిజి టీమ్ ఆశ్రమాన్ని సందర్శించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పిజిఅధికారులు ఆశ్రమం లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అంతేకాకుండా ప్రధాని ఏయే ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుందనే వివరాలను కూడా సేకరించారు.
ఈ క్రమంలోనే ఎస్పిజి అధికారులు సెక్యూరిటీ పరంగా చిన్నపాటి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ప్రధానమంత్రి మోదీ ముచ్చింతల్, ఇక్రిశాట్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి గురువారం నాడు బిఆర్కె భవన్లో సిఎస్ సోమేశ్‌కుమార్ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. వేదికల వద్ద తగు వైద్య శిబిరం తో పాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో వివిఐపిల సందర్శన సమయంలో కరోనా ప్రోటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు.
అదేవిధంగా వివిఐపి పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టిపిసిఆర్ పరీక్షలను చేపట్టాలని, కరోనా స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బి శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ముచ్చింతల్ పరిసర ప్రాంతాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిజిపి డా. మహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జిఎడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వీ, రవాణా, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని హాజరు కానున్న నేపథ్యంలో ఎస్పిజి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమతా మూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పని చేయనుంది. ఎస్పిజి పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు నిరంతరం నిఘా సారిస్తున్నారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!