శశికళకు జైలులో రాజభోగాలపై ఎసిబి చార్జిషీట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె జయలలిత సన్నిహితురాలు వికె శశికళకు బెంగుళూరులోని కేంద్ర కారాగారంలో రాజభోగాలు కల్పించారని, ఇందుకోసం కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
 
 కర్నాటకకు చెందిన ఇద్దరు సీనియర్ జైలు అధికారులు, శశికళతో సహా ఆరుగురు వ్యక్తులపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు కర్నాటక హైకోర్టుకు ఎసిబి తెలియచేసింది. చెన్నైకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కెఎస్ గీత దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ సూరజ్ గోవిందరాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ చిచారణ చేపట్టింది.
ఇద్దరు జైలు అధికారులను ప్రాసిక్యూట్ చేయయడానికి కర్నాటక ప్రభుత్వం 2021 డిసెంబర్ 30న అనుమతి ఇవ్వగా 2022 జనవరి 7న చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఎసిబి తెలిపింది. కోట్లాది రూపాయల అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి 2021 జనవరిలో విడుదలయ్యారు. 
 
ఎసిబి తన కేసులో ఎ 1 నిందితునిగా జైలు చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణకుమార్, ఎ2గా సూరింటెండెంట్ అనితను చార్జిషీట్‌లో పేర్కొంది.
త్వరలోనే నా చేతికి అన్నాడీఎంకే
మరోవంక, త్వరలోనే అన్నాడీఎంకే తన హస్తగతమవుతుందని, ఆ పార్టీ బహిష్కృత నేత వీకే శశికళ ప్రకటించారు. టి.నగర్‌లోని తన నివాసంలో అన్నాదురై 53వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శశికళ నివాళులర్పించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నాదురై అత్యంత ఆప్తుడిగా ఎంజీఆర్‌ ఉండేవారని, ఆయన బాటలోనే పార్టీ స్ధాపించారని పేర్కొన్నారు.
అన్నాదురై, ఎంజీఆర్‌ బాటలో కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే త్వరలో తప్పకుండా తన చేతుల్లోకి వస్తుందని, జయ ఆశయాలను నెరవేర్చేలా అధికారం చేపట్టి ప్రజాపాలన అందిస్తానని ఆమె  వెల్లడించారు. కార్యకర్తలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆమె కోరారు.
కరోనా వ్యాప్తి కారణంగా కార్యకర్తలను కలుసుకోలేకపోయానని చెబుతూ త్వరలో జిల్లాలవారీగా పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతానని ఆమె వెల్లడించారు. గత 8 నెలలు అధికారం చెలాయిస్తున్న పార్టీ గురించి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేశారని, ఎవరి పాలన బాగుంటుందో వారికి బాగా తెలిసొచ్చిందని శశికళ చెప్పారు.