చైనా,పాక్ లపై రాహుల్ వాఖ్యలు ఖండించిన నట్వర్ సింగ్

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్లే చైనా, పాకిస్థాన్ సన్నిహితమయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ‘ఏమాత్రం యథార్థం కాదు’ అని మాజీ విదేశాంగ మంత్రి కే నట్వర్ సింగ్ చెప్పారు. 
నట్వర్ సింగ్ ఓ వార్తా సంస్థతో గురువారం మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎంతమాత్రం సరైనవి కాదని, యథార్థాలు కాదని ఆయనకు చెప్పడానికి ప్రభుత్వం తరపున ఎవరూ లేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. చైనా, పాకిస్థాన్ 1960వ దశకం నుంచి సన్నిహిత మిత్ర పక్షాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సాన్నిహిత్యం ఆయన ముత్తాత, భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. కశ్మీరు అంశాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళినది కూడా  నెహ్రూయేనని ఆయన గుర్తు చేశారు.
మరోవంక, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సోదరుడు, మాజీ ఇండియన్ ఫారిన్ సెక్రటరీ కన్వల్ సిబల్ కూడా రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. భారత దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పూర్వమే చైనా, పాకిస్థాన్ స్నేహం ప్రారంభమైందని తెలిపారు.  1962లో యుద్ధం జరిగిన తర్వాత చైనా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని ఆయన చెప్పారు. అణ్వాయుధ రంగంలో ఈ రెండు దేశాలు చట్టవిరుద్ధంగా కుమ్మక్కయినట్లు అందరికీ తెలుసునని గుర్తు చేశారు.
 
రాహుల్ గాంధీ ఏమన్నారంటే…రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ బుధవారం మాట్లాడారు.
 ‘‘చైనాకు తాను చేయాలనుకుంటున్నదేమిటో చాలా స్పష్టమైన దృక్పథం ఉంది. చైనా, పాకిస్థాన్‌లను వేర్వేరుగా ఉంచడమే భారత దేశ విదేశాంగ విధానపు ఏకైక అతి పెద్ద వ్యూహాత్మక లక్ష్యం. మీరు చేసిందేమిటంటే, మీరు వాటిని ఒక చోటుకు చేర్చారు. మీ ముందు ఉన్న బలగాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీరు పాకిస్థాన్, చైనాలను దగ్గరకు చేర్చారు. భారతీయులపట్ల మీరు పాల్పడగలిగే ఏకైక అతి పెద్ద నేరం ఇది’’ అని విమర్శించారు.
1962 అక్టోబరు, నవంబరు నెలల్లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.