మరోసారి బెంగాల్ గవర్నర్ – మమతా మధ్య పోరు!

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర గవర్నరుకు, ప్రభుత్వానికి మధ్య మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహార శైలిని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. బిజెపి సీనియర్‌ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి పర్యటనలో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకునేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సిఎస్‌ హెచ్‌కె ద్వివేదిని ఈ నెల 25న పిలిపించారు. 
 
కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో 31న రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా మరోసారి కోరారు. ఝార్గామ్‌ జిల్లాలోని నేతారును సందర్శించనివ్వకుండా తనను అడ్డుకున్నారంటూ సువేందు అధికారి గవర్నర్‌కు లేఖ రాశారు. 11 ఏళ్ళ క్రితం తుపాకీ కాల్పుల్లో మరణించిన వారికి నివాళి అర్పించేందుకు తాను వెళ్ళాలనుకున్నానని, కానీ అధికారులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. 
 
ఈ పర్యటన గురించే పేచీ మొదలైంది. గవర్నర్‌ కార్యాలయం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘిస్తూ ప్రధాన కార్యదర్శి  వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు. ఆయన చర్యలు అల్‌ ఇండియా సర్వీస్‌ (కండక్ట్‌) నిబంధనలు, 1968ని ఉల్లంఘించేలా వున్నాయని, ఉద్దేశ్యపూర్వకంగా చేసే ఈ చర్యలకు తీవ్ర పర్యసానాలు వుంటాయని హెచ్చరించారు. 
 
ఎందుకు హాజరు కాలేకపోయారో తెలియచేస్తూ ప్రధాన కార్యదర్శి కూడా వివరణ ఇవ్వాలని కోరారు. ఈ హెచ్చరిక చేసినా లక్ష్య పెట్టనిద్వివేది ప్రతిస్పందన అవమానకరమైన రీతిలో వుందని గవర్నర్‌ పేర్కొనాురు.  మరోవంక, గవర్నర్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాజ్యసభలో తీర్మానం ప్రతిపాదించేందుకు టిఎంసి సిద్ధమవుతున్నది.