30 ఏళ్ల తర్వాత లాల్‌చౌక్‌లో మువ్వన్నెల రెపరెపలు

30 ఏళ్ల తర్వాత లాల్‌చౌక్‌లో మువ్వన్నెల రెపరెపలు

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారంనాడు అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్(ఘంటా ఘర్)పై త్రివర్ణ పతాకం రెపరెలాడింది. 30 ఏళ్ల తర్వాత ఈ దృశ్యం కనిపించింది. 

అంతకుపూర్వం బిజెపి అధ్యక్షునిగా మురళీ మనోహర్ జోషి 1992లో లాల్‌చౌక్ లో జెండా ఎగురవేశారు. అప్పట్లో కశ్మీర్ లోయలో తీవ్రవాదుల ప్రాబల్యం తీవ్రంగా ఉండేది. ఆ తర్వాత లాల్‌చౌక్‌లో మువన్నెల రెపరెపలు ఇదే తొలిసారి. 

73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా బుధవారంనాడు సాజిద్, సహిల్ బషీర్ అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు క్రేన్ సాయంతో క్లాక్ టవర్‌పైకి వెళ్లి మువన్నెల జెండాను రెపరెపలాడించారు. వారి వెంట డజన్ల కొద్దీ స్థానికులు కూడా ఉన్నారు.

మార్షల్ ఆర్ట్ యువ క్రీడాకారులు కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. దేశభక్తి గీతాలు పాడుతూ నృత్యాలు చేశారు. వారికి భద్రతగా పోలీసు సిబ్బంది వలయంగా నిలుచున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మత్రమే ఎగిరేవని, శాంతికి భంగం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారని స్థానికులు పేర్కొన్నారు. 

370వ అధికరణ రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, నయా కశ్మీర్ అంటే ఏమిటని జనం అడుగుతున్నారని మరో వ్యక్తి వివరించారు. ఇప్పుడు ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుందని, ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నారని, తాము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నామని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.