బీహార్ రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల రద్దు

బీహార్ రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల రద్దు
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షలు, ఎంపిక క్రమం తీరు పట్ల అభ్యర్ధులు తీవ్రంగా మండిపడిన నేపథ్యంలో ఎన్‌టిపిసి (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌), లెవల్‌ 1 పరీక్షలను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. 
 
రిక్రూట్‌మెంట్‌ పరీక్షల ఎంపిక క్రమం పట్ల అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజులుగా హింసాత్మక నిరసనలకు, ఆందోళనలకు దిగారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.  వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బి) నిర్వహించిన పరీక్షల్లో పాసయిన, ఫెయిలైన అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను, వారి సాధకబాధలను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది.
 
 ఫిబ్రవరి 16వరకు అభ్యర్ధులు తమ అభ్యంతరాలను కమిటీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కమిటీ తన నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు అందచేస్తుందని ప్రతినిధి తెలిపారు. 
 
మరోవంక, ‘రైల్వే ఆస్తులు ప్రజలందరివీ.. వాటికి నష్టం చేకూర్చొద్దు’ అంటూ నిరసన కారులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
కాగా, రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు విధ్వంసానికి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడైనట్లైతే వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్‌మెంట్‌ చేసుకోకుండా నిషేధం విధిస్తామని హెచ్చరిస్తూ మంగళవారం రైల్వే ఒక నోటీసు జారీ చేసింది. 
 
అంతకుముందు బీహార్‌లో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారులు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు.