పల్నాడులో పడగవిప్పిన కక్షలు… టిడిపి నేత హత్య

గుంటూరు జిల్లాలో ముఠా కక్షలకు పేరొందిన పల్నాడు ప్రాంతంలో తిరిగి హత్యా రాజకీయాలు పడగ విప్పుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.  వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత చంద్రయ్య దారుణ హత్య గురైయ్యాడు. మాచర్ల టిడిపి ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడైన చంద్రయ్యను దుండగులు కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశారు. 

చంద్రయ్య గ్రామ సెంటర్ లో కుర్చోని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్ధులు పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చంద్రయ్యపై వెల్దుర్తి మండలం ఎంపిపి చింత శివ రామయ్య, ఎంపిపి కోడుకు ఆదినారయణ, తోట రామంజనేయులు కలిపి దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలనే బ్రహ్మారెడ్డి టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నీయమితులయ్యారు. ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా పేరొందింది. 

చంద్రయ్య మృతిపట్ల ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.టిడిపి  కె అచ్చన్నాయుడు కూడా ఆయనతో వెడుతున్నారు. 

కాగా… చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకుంటారేమోనని  టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ అధినేతతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు, దూళిపాళ్ల నరేంద్ర, ఇతర నేతలు కూడా గుండ్లపాడుకు బయలుదేరారు. 

మాచర్ల టిడిపి ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడైన చంద్రయ్యను హత్యపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు.