బీజేపీ ప్రధాన కార్యాలయంలో 50 మందికి కరోనా

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు బుధవారం ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా కో-హెడ్ ఇన్‌ఛార్జ్ సంజయ్ మయూఖ్‌తో సహా దాదాపు 50 మందికి కరోనా సోకింది. 

దీంతో వారిని క్వారంటైన్‌కు కరోనా సోకిన వారందరూ కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం చికిత్స పొందుతున్నారు. బీజేపీ కార్యాలయంలో శానిటైజ్ చేశారు. బీజేపీ కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ నేతలు చెప్పారు.

మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ రోజు రెండో విడత సమావేశం జరగనుంది. సోమవారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తనకు కొవిడ్ సోకినట్లు చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌లకు కూడా సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో 1,94,720 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా వల్ల 442 మంది మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

నితిన్ గడ్కరీ, అమరీందర్‌ లకు కరోనా పాజిటివ్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నాయని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ట్వీట్‌లో కోరారు.

సింగ్ భార్య, కాంగ్రెస్ పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ సైతం ఇటీవల కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. 79 ఏళ్ల అమరీందర్ సింగ్ ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని సొంతంగా ఏర్పాటు చేశారు. త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహితం తాను కరోనా బారిన పడినట్లు, హోమ్ ఇసోలాటిన్ లో ఉన్నట్లు తెలిపారు.