భారత్ లో మూడోవేవ్  …2,135 మందికి ఒమైక్రాన్

భారత్ లో మూడోవేవ్  …2,135 మందికి ఒమైక్రాన్
ఓ వైపు కరోనా కేసులు… మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు 50వేలు దాటుతుండగా… ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరింది. అలాగే ఒమైక్రాన్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 828గా ఉంది.
 
ఢిల్లీలో వారాంతరం కర్ఫ్యూ విధించడంతో, కర్ణాటక, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించి, వారాంతరం కర్ఫ్యూ విధించాయి. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల చూస్తుంటే దేశంలో మూడో వెవ్ ను  సూచిస్తోందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు.
 ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అయితే  భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్‌లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
 కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ పాజిటీవీటి రేటు 4.18 శాతంగా నమోదైంది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,14,004 కాగా.. 3,43,21,803 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 4,82,551కి చేరింది. 147.72 కోట్ల మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
మరోవంక, కరోనా పాజిటివ్‌ రేటును గమనిస్తే థర్డ్‌ వేవ్‌ వచ్చినట్లు ఖరారైందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్‌ స్పష్టం చేశారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్‌ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు. 

బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్‌ జోన్‌ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్‌ జోన్‌లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు. 

బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు. అందుచేత వైరస్‌ అతి వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి తెలిపారు. కాంగ్రేస్‌నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు.

ఇలా ఉండగా, డిసెంబర్‌ తొలి వారంలో దేశంలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించగా.. రెండు వారాల్లోనే 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్‌ విస్తరించింది. రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు ఈ విధంగా ఉన్నాయి: మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71 ,ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్ర ప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ 20 , మధ్యప్రదేశ్ 9 ,ఉత్తరాఖండ్ 8, గోవా 5  కేసులు నమోదు అయ్యాయి.