ఇటీవల కాలంలో పుస్తక పఠనం తగ్గిపోతుండడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తూ పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం అందరిపై ఉందని చెప్పారు.
విద్యార్థులకు చిన్ననాటి నుండే పుస్తకాల పట్ల అభిరుచి, ఆసక్తి కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని చెప్పారు.
భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందని చెప్పారు.
పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదని స్పష్టం చేశారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని ఆయన తెలిపారు.
విజయవాడ పుస్తక మహోత్సవానికి ఎంతో చరిత్ర ఉందని అంటూ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద బుక్ ఫెయిర్ విజయవాడలోనే జరుగుతుందని తెలిపారు. ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న బుక్ ఫెస్టివల్ సొసైటీ వారిని గవర్నర్ అభినందించారు.
అనంతరం స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన కాళీపటుం రామారావు సాహిత్య వేదికపై పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు… జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖ పబ్లిషింగ్ సంస్థలు సుమారు 250 వరకు పుస్తక ప్రదర్శనకు వచ్చాయి.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు