ఏపీలో ఎఫ్‌సిఆర్‌ఎ నమోదు కోల్పోయిన 973 ఎన్‌జిఒలు

విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద నమోదయిన  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 973 స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జిఒ) లైసెన్సులను కేంద్ర హోంశాఖ వద్ద గడువులోగా పునరుద్ధరించుకోక పోవడంతో వారు లైసెన్స్ కోల్పోయిన్నట్లయింది.  ఆయా సంస్థల లైసెన్సుల కాలపరిమితి గతేడాది డిసెంబరు 31న ముగిసింది.

2020 సెప్టెంబరు 29 నుంచి 2021 డిసెంబరు 31లోగా లైసెన్సుల కాలపరిమితి ముగిసే సంస్థలు రెన్యువల్‌ చేసుకోకపోవడం, కనీసం దరఖాస్తు కూడా చేసుకోకపోవడంతో వాటి ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులను రద్దు చేసినట్లు హోంశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 5,933 ఎన్‌జిఒల లైసెన్సులు రద్దవ్వగా, అందులో ఎపికి చెందినవే 973 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి.

విదేశీ సంస్థల నుంచి స్వచ్ఛంద సంస్థలు విరాళాలు పొందాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్‌సిఆర్‌ఐ లైసెన్సు పొందాల్సి ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పేరును క్రైస్తవ  సంస్థలతోపాటు విద్యా, వైద్య, సాంస్కృతిక రంగాలు, గ్రామీణాభివృద్ధి, పేదలు, యువజన సంక్షేమం, అభివృద్ధి సంస్థల లైసెన్సులు సైతం రద్దయ్యాయి.

రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 127 సంస్థల లైసెన్సులు రద్దవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో 15 ఎన్‌జిఒలు తమ లైసెన్సులను కోల్పోయాయి. చిత్తూరు జిల్లాలో 114, కడపలో 99, కృష్ణాలో 98, తూర్పు గోదావరిలో 87, విశాఖపటుంలో 78, కర్నూలులో 71, నెల్లూరులో 69, పశ్చిమ గోదావరిలో 67, అనంతపురంలో 63, ప్రకాశంలో 60, విజయనగరంలో 25 సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి.

అనంతపురం జిల్లాలో సత్యసాయి సంస్థల ఆధీనంలో నడిచే మెడికల్‌ ట్రస్ట్‌ సహా పలు సంస్థల లైసెన్సులు కూడా రద్దయ్యాయి. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన చుక్కపల్లి చారిటబుల్‌ ట్రస్టు, ఏథెస్ట్‌ సెంటర్‌, నూజివీడులోని జిఎం హాస్పిటల్‌, జాక్‌నెల్‌, పుణ్య చారిటీస్‌ వంటి సంస్థలు సైతం ఉన్నాయి.

క్రైస్తవ సంస్థల ఆధీనంలో నడిచే పలు వైద్యశాలలు సైతం లైసెన్సులు కోల్పోయాయి. కాకినాడలోని లెప్రసీ మిషన్‌ హాస్పిటల్‌, క్రిస్టియన్‌ కేన్సర్‌ సెంటర్‌, గుంటూరు జిల్లాలో ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ప్రకాశం జిల్లాలో గుడ్‌ షెప్పర్డ్‌ మినిస్ట్రీస్‌, విశాఖపటుంలో విశాఖపటుం పబ్లిక్‌ లైబ్రరీ సొసైటీ, పశ్చిమ గోదావరిలో ముళ్లపూడి వైద్య సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులు కూడా రద్దయ్యాయి.

రాష్ట్రంలో 2012 నుంచి 2019 వరకు 2,025 ఎన్‌జిఒల లైసెన్సులు రద్దవ్వగా, ఒక్కరోజులోనే 973 సంస్థలపై వేటుపడింది. రాష్ట్రంలో ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సు ఉన్న సంస్థలు 1,154 ఉన్నట్లు హోంశాఖ వెల్లడించింది.