విద్యుత్‌ వినియోగదారులపై అభివృద్ధి చార్జీల భారం

విద్యుత్‌ వినియోగదారులపై ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చార్జీల పేరిట మరో భారం వేస్తోంది. గృహ, వాణిజ్య, వ్యవసాయ కొత్త కనెక్షన్‌ తీసుకునే సమయంలో వసూలు చేసే అభివృద్ధి చార్జీలను పెంచాలనివిద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కాములు) ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ఆమోదం తెలిపింది. 
 
ఈ మేరకు అభివృద్ధి చార్జీలు పెంచుతూ శుక్రవారం ఎపిఇఆర్‌సి కార్యదర్శి మురళీకృష్ణగెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇప్పటికే సంస్కరణల పేరుతో విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన డిస్కామ్‌లకు అభివృద్ధి పేరుతో ప్రజలపై భారాలు మోపేందుకు ఇఆర్‌సి అనుమతి ఇచ్చింది. 
 
గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు తీసుకునే సమయంలో మనం వాడుకునే ఉపకరణాలను బట్టి అభివృద్ధి చార్జీలను వసూలు చేస్తారు. ప్రస్తుతం కిలో వాట్‌కు రూ.1200 చొప్పున గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులు చెల్లిస్తున్నారు. దీంతోపాటు సెక్యూరిటీ కింద రూ.200, దరఖాస్తు కింద రూ.50 చెల్లిస్తున్నారు. కిలో వాట్‌లోపు కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారుడు ఇప్పటి వరకు రూ.1450 మాత్రమే చెల్లించారు. 
 
ఇప్పుడు రూ.1200 అభివృద్ధి చార్జీలను రూ.1500లకు పెంచింది. అదనంగా మరో కిలో వాట్‌ లోడ్‌ కావాలంటే ఉను రూ.1200గా ఉన్న చార్జీలను రూ.2000 లకు పెంచింది. ఇప్పుడు కొత్త చార్జీల ప్రకారం కిలోవాట్‌ లోడ్‌ కనెక్షన్‌ కావాలంటే రూ.1750 చెల్లించాల్సి ఉంటుంది. రెండు కిలోవాట్స్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,850, ఇకపై రూ.3,750లు చెల్లించాలి. 
 
గృహ, వాణిజ్య వినియోగదారులకు కనీస లోడ్‌గా కిలోవాట్‌ కింద డిస్కాంలు కనెక్షన్లు ఇచ్చాయి. ఇప్పుడు కొత్తగా గృహ వినియోగదారులను 500 వాట్స్‌, 501-1000ల వాట్స్‌లుగా విభజించింది. 500లోపు వారికి రూ.800ల చొప్పున వసూలు చేయనుంది. 
 
250వాట్‌లోపు ఉను వాణిజ్య వినియోగదారుల నుంచి రూ.600లు, 251-500 వినియోగదారుల నుంచి రూ.1000లు, 501-1000 వినియోగదారులకు రూ.1800ల చొప్పున వసూలు చేయనుంది. వాణిజ్య వినియోగదారులకు కూడా రూ.1800లకు, వ్యవసాయ పంపుసెట్లకు రూ.1500లకు పెంచింది. వాణిజ్య వినియోగదారులు అదనంగా మరో వాట్‌ కావాలంటే రూ.2000లు, వ్యవసాయ రైతులు రూ.1500లు చొప్పున చెల్లించాలి.

వినియోగదారుల వాడకం లోడ్‌ పెరిగిందనే కారణంతో విద్యుత్‌ అధికారులు గతంలో ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా జరిమానాలు వేస్తుంటారు. దీనిపై ప్రజలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించడంతో విద్యుత్‌ అధికారులు వెనక్కు తగ్గారు. ఇప్పటి ఉత్తర్వులతో గృహ వినియోగదారుల ఇళ్లల్లోకి చొరబడేందుకు అనుమతి ఇచ్చిన్నట్లే అవుతుంది. 

 
లోడ్‌ పెరిగిందని ఫైన్‌లు వేయడంతో పాటు, వినియోగదారులపై వేధింపులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే కనెక్టెడ్‌ లోడ్‌ కిలో వాట్‌ ఉను వినియోగదారులను 2కిలో వాట్‌లోకి మార్చాలని విద్యుత్‌ శాఖ అధికారులు కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి చేస్తోంది.