హైదరాబాద్ లో ఆందోళన కలిగిస్తున్న కరోనా ఉదృతి 

హైదరాబాద్ లో ఆందోళన కలిగిస్తున్న కరోనా ఉదృతి 

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో ఏకంగా స్కూళ్లు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు, పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూ చర్యలు తీసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 

రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమైనవన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ హానికలిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖల నివేదికల ప్రకారం హైదరాబాద్ నగరంలో  ఈనెల 24వ తేదీన 81 కేసులు నమోదుకాగా, 25వ తేదీన 92 కేసులు నమోదయ్యాయి.  అలాగే 26వ తేదీన 69, 27న 90, 28న 110కేసులు నమోదయ్యాయి. ఇక 29వ తేదీన 121 కేసులు నమోదు కాగా, గురువారం 167 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

దేశం మొత్తం మీద నూతన సంవత్సర వేడుకల పేరుతో బార్ లను అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంచుకోవడానికి, పబ్ లలో, ఇతరత్రా తెల్లవార్లూ వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాలే కావడం గమనార్హం. దానితో హైదరాబాద్ పై వత్తిడి పెరుగుతున్నది.  మహారాష్ట్రా,  కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. 

దాంతో స్థానిక హోటళ్లకు గిరాకి పెరిగింది. మరోవంక, నగర వాసుల్లో అజాగ్రత్త పెరిగిపోతోంది.  రోడ్డులపై, ఇతర బహిరంగ ప్రదేశాలలో  కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. కొందరు మాస్క్ పెట్టుకున్నా.. మొహానికి ఫుల్ కవర్ అయ్యేలా ఉండట్లేదు. హ్యాండ్ శానిటైజ్ వాడటం, మొహనికి మాస్క్ ధరించడం పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 

వ్యాక్సిన్ వేసుకున్నమానే ధీమా కొందరిలో ఉంటే.. మనకు కరోనా రాదులే అనే నిర్లక్ష్య ధోరణి మరికొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రైతు బజార్లు, గల్లీ మార్కెట్ లు, షాపింగ్ ఏరియాల్లో గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారు. నో మాస్క్-నో ఎంట్రీ బోర్డులను ఎవ్వరు లెక్క చేయడం లేదు.

ప్రభుత్వం నుంచి మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్ వేయాలనే ఉత్తరువులు ఉన్నా.. అమలు చేయడంలో అధికారులు, పోలీసులు విఫలమవుతున్నారు.